అండగా ఉంటాం.. ఆందోళన వద్దు... మదీనా బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భరోసా

అండగా ఉంటాం.. ఆందోళన వద్దు...  మదీనా బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భరోసా
  •     44 మంది మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పంపిణీ
  •     గాయపడిన వారి ఫ్యామిలీకి రూ.3 లక్షలు అందజేత
  •     మానవతా దృక్పథంతోనే పరిహారం అందజేస్తున్నట్టు వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ‘‘ఈ ప్రభుత్వం మీది.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు.. మీకు అన్నివిధాలా అండగా ఉంటాం’’ అని మదీనా బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి భరోసా ఇచ్చారు. శనివారం సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌లో బాధిత కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి సమావేశం అయ్యారు. ప్రమాదంలో మృతిచెందిన 44  మంది కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, తీవ్రంగా గాయ పడిన వారి కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. మదీనాలో ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే అజారుద్దీన్‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని అక్కడికి పంపామని గుర్తు చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తక్షణమే పాస్‌‌‌‌‌‌‌‌పోర్టులు, వీసాలు ఇప్పించి మదీనా పంపించామని చెప్పారు. అక్కడి భారత కాన్సులేట్‌‌‌‌‌‌‌‌, సౌదీ ప్రభుత్వంతో చర్చించి మృతుల అంత్యక్రియలు జన్నుతుల్ బఖీలో అధికారికంగా జరిగేలా చూశామని వెల్లడించారు. 

సాధారణంగా విదేశాల్లో జరిగే ప్రమాదాల్లో మృతిచెందిన వారికి ప్రభుత్వాలు పరిహారం చెల్లించవని.. కానీ, తాము మాత్రం మానవతా దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఇటీవల నాంపల్లి అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు కూడా ఇదే తరహాలో పరిహారం చెల్లిం చామని తెలిపారు. పరిహారం చెక్కులను నేరుగా ఇండ్లకే పంపవచ్చని.. కానీ, బాధితులతో స్వయంగా మాట్లాడి, ప్రభుత్వం అండగా ఉందనే భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే వారిని సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌కు ఆహ్వానించినట్టు చెప్పారు. 

సొంత ఖర్చులతో హజ్ యాత్రకు..

ముస్లిం మైనార్టీలతో తనకున్న అనుబంధాన్ని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి గుర్తుచేసుకున్నారు. తాను కొడంగల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన 2009 నుంచి.. నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఏటా ఐదుగురిని తన సొంత ఖర్చులతో హజ్ యాత్రకు పంపుతున్నానని వెల్లడించారు. యాత్రికులను ఎంపిక చేసే బాధ్యతను కూడా స్థానిక ముస్లిం మత పెద్దలకే అప్పగించినట్టు చెప్పారు. 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సీఎం సలహాదారు వేం నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్‌‌‌‌‌‌‌‌, హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రో పాషా, టీజీఎంఆర్‌‌‌‌‌‌‌‌ఈఐఎస్  వైస్ చైర్మన్ ఫహీం ఖురేషి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.