హైదరాబాద్ ను పాతాళానికి తీస్కపోయిండు : కేటీఆర్

హైదరాబాద్ ను పాతాళానికి తీస్కపోయిండు : కేటీఆర్
  •     సీఎం రేవంత్​ ప్రజల సమస్యలను పట్టించుకుంటలేరు: కేటీఆర్​
  •     పాలన పేరిట రెండేండ్లుగా రియల్​ ఎస్టేట్​ వ్యాపారం చేస్తుండు
  •     కుటుంబ సభ్యులు, అనుచరులకు సిటీని దోచిపెడ్తుండని కామెంట్
  •     జీహెచ్​ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశం

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వం, సీఎం రేవంత్​ రెడ్డి రెండేండ్లుగా హైదరాబాద్​ను అన్ని రంగాల్లో పాతాళానికి తీసుకుపోయారని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ విమర్శించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం తన ఆర్థిక ప్రయోజనాలు, రియల్​ ఎస్టేట్​వ్యవహారాల కోసమే రేవంత్​పాలన చేస్తున్నారన్నారు. హైదరాబాద్​లో భూములే లక్ష్యంగా అక్రమ సంపాదన కోసమే నగర పతనానికి ఒడిగట్టారని ఆరోపించారు. 

శనివారం హైదరాబాద్​లో జీహెచ్​ఎంసీ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్​చార్జులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలన పేరిట రెండేండ్లుగా సీఎం రేవంత్​ చేసింది రియల్​ ఎస్టేట్​ వ్యాపారమన్నారు. 

కుటుంబ సభ్యులు, అనుచరుల కోసం హైదరాబాద్​ నుంచి వేల కోట్లు దోచిపెట్టేందుకు ఎన్నో స్కామ్​లు చేశారని ఆరోపించారు. హైడ్రా నుంచి మొదలుకొని హిల్ట్​పాలసీ స్కామ్, టీడీఆర్​స్కామ్, ఫోర్త్​ సిటీ భూముల కుంభకోణం వంటి వాటికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఫ్యూచర్​ సిటీని పట్టించుకోవడం మానేశారన్నారు. కనీసం దోమల నివారణ కూడా చేపట్టట్లేదని విమర్శించారు. పదేండ్లలో ఎన్నడూ లేనంతగా కరెంట్​ కోతలు, మంచినీటి ఇబ్బందులు, పారిశుధ్య సమస్యలు మళ్లీ మోపయ్యాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.  

ఎక్కడికి వెళ్లినా ఫ్యూచర్​ సిటీ గురించే..

మన దేశంతో పాటు ఇతర దేశాలకు వెళ్లినా రేవంత్​ రెడ్డి కేవలం ఫ్యూచర్​ సిటీ గురించే మాట్లాడుతున్నారని కేటీఆర్ ​విమర్శించారు. సిటీలో మౌలిక వసతులను కల్పించకుండా.. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పదేండ్లలో సిటీని అగ్రశ్రేణి మెట్రో నగరంగా తీర్చిదిద్దామని చెప్పారు. కరెంట్ కోతలు లేకుండా, తాగునీరు, పారిశుధ్యం నుంచి మొదలుకొని ప్రజా రవాణా వరకు అన్ని రంగాల్లో నగరాన్ని ముందుకు తీసుకుపోయామని కేటీఆర్ గుర్తు చేశారు. అందుకే ప్రజలు రెండు సార్లు రాష్ట్ర రాజధానిలో మేయర్ పీఠాన్ని మా పార్టీకి కట్టబెట్టారన్నారు. 

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ మేయర్ పీఠంపై గులాబీ జెండా ఎగురవేశామని కేటీఆర్ గుర్తు చేశారు. కార్పొరేషన్​ ఎన్నికలు పెడితే.. పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసుకునేందుకు మూడు కార్పొరేషన్లకు ఇన్​చార్జులను నియమించారు. జీహెచ్​ఎంసీకి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మల్కాజిగిరి కార్పొరేషన్​కు ఎమ్మెల్సీ శంభీపూర్​ రాజు, సైబరాబాద్​ మున్సిపల్​ కార్పొరేసన్​ కు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్​ రెడ్డిని ఇన్​చార్జులుగా కేటీఆర్ నియమించారు.