ఇతర మతస్తుల విశ్వాసాలు దెబ్బతీస్తే కేసులు

ఇతర మతస్తుల విశ్వాసాలు దెబ్బతీస్తే కేసులు
  • అధికారులకు సీఎం కేసీఆర్​ ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: అశాంతిని సృష్టించాలనుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని సీఎం కేసీఆర్  అన్నారు. ఇతర మతస్తుల మనోభావాలు, విశ్వాసాలను దెబ్బతీసేలా మాట్లాడితే కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. చట్ట ప్రకారం ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, ప్రజలెవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని కోరారు. హైదరాబాద్ తోపాటు రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. అవసరమున్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టేలా దృష్టిసారించాలన్నారు. శాంతిభద్రతలపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో బుధవారం నాలుగున్నర గంటల పాటు సమీక్ష నిర్వహించారు.

సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితోపాటు ఐజీలు, పోలీసు కమిషనర్లు ఇందులో పాల్గొన్నారు. సామాన్య ప్రజలకు, వ్యాపార వర్గాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. శాంతి భద్రతల విషయంలో తెలంగాణ సర్కారు రాజీ లేని విధానాన్ని అవలంబిస్తుందని సీఎం తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు అనుగుణంగా ప్రజలకు జీవించే హక్కు ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. రాజాసింగ్ విషయంలోనూ నిబంధనలకు తగ్గట్టుగా పోలీసులు వ్యవహరించాలని, ప్రజలంతా సోదరభావంతో మెలగాలన్నారు.