సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట జిల్లాలో పంచాయతీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన పలువురు సర్పంచ్ అభ్యర్థులపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్ తెలిపిన ప్రకారం .. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి సర్పంచ్ అభ్యర్థి నాగుల స్రవంతి పెద్దమ్మ గుడి వద్ద ఒకే కులానికి చెందిన 44 మందికి మద్యం పంపిణీ చేస్తుండగా సమాచారం అందడంతో మండల ఫ్లయింగ్ స్కాడ్ టీమ్ ఇన్ చార్జ్ వంశీకృష్ణ అక్కడికి వెళ్లి 68 క్వార్టర్ బాటిల్స్ తో పాటు, 39 మోటార్ సైకిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
అభ్యర్థి స్రవంతితో పాటు 44 మందిపై కేసు నమోదు చేశారు. అదే మండలంలోని మిట్టపల్లి సర్పంచ్ అభ్యర్థి చింతలకుమార్ తన ఇంట్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తుండగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆర్ఎస్ఐ సురేశ్ సిబ్బందితో వెళ్లాడు. పోలీసులను చూసి డబ్బులు గోడపై నుంచి అవతల పడేశాడు. రూ. 25,500 స్వాధీనం చేసుకుని, అభ్యర్థి చింతల కుమార్ తో పాటు చింతల రాజుపై కేసు నమోదు చేశారు.
కొండపాక మండలం ఖమ్మంపల్లికి చెందిన అభ్యర్థులు మంద భాస్కర్ రెడ్డి, తిమ్మాపురం కర్ణాకర్ రెడ్డి తమ వ్యవసాయ బావుల వద్ద భోజనాలు వండించి ఓటర్లకు పెడుతున్నారు. సమాచారం అందడంతో వెళ్లి కేసు నమోదు చేశారు. అంకిరెడ్డి పల్లి 10 వ వార్డ్ మెంబర్ అభ్యర్థి తాళ్లపల్లి చందన్ ఎల్లమ్మ తల్లి గుడిలో తన కులస్తులు 12 మందికి మద్యం పార్టీ ఇస్తుండగా వెళ్లి పట్టుకుని అతనిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
లిక్కర్ స్వాధీనం
సిద్దిపేట టౌన్ నుంచి ఆటోలో మద్యం తరలిస్తున్నారనే సమాచారంతో టూటౌన్ ఎస్ఐ ఎన్. వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి నిఘా పెట్టి వేములవాడ కమాన్ వద్ద ఆటోను పట్టుకున్నారు. రేగులపల్లి సర్పంచ్ అభ్యర్థి జింగిలి లక్ష్మి అల్లుడు కుంభం శ్రీకాంత్ ఆదేశాలతో టౌన్ లోని కనకదుర్గ వైన్స్ నుంచి మద్యం తీసుకొని గ్రామానికి వెళుతున్నట్లు డ్రైవర్ తాళ్లపల్లి శ్రీనివాస్ తెలిపాడని, మద్యం బాటిళ్లతో పాటు, బీర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

