పేషెంట్లను ప్రైవేటుకు  పంపితే కేసులు

పేషెంట్లను ప్రైవేటుకు  పంపితే కేసులు
  • సర్కారు దవాఖాన్లలో సిబ్బంది, డాక్టర్లపై నిఘా.. ప్రభుత్వం నిర్ణయం
  • ప్రైవేటుకు రిఫర్​ చేస్తున్నరంటూ ఇటీవలి రివ్యూలో హరీశ్​కు అధికారుల ఫిర్యాదు
  • అన్ని దవాఖాన్లలోనూ సీసీ కెమెరాలు పెట్టాలని ఆదేశం


హైదరాబాద్​, వెలుగు:ప్రభుత్వ దవాఖాన్లకు వచ్చే పేషెంట్లను తప్పుదోవ పట్టించి ప్రైవేటు దవాఖాన్లకు రిఫర్​ చేసే డాక్టర్లు, సిబ్బందిపై కేసులు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిబ్బందిపై సీసీ కెమెరాలతో నిఘా పెట్టాలని ఆస్పత్రుల సూపరింటెండెంట్​లకు సూచించింది. ఆర్థోపెడిక్​ ఆపరేషన్​ కేసులు, డెలివరీ కేసులు ప్రభుత్వ దవాఖాన్ల నుంచి, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్న ఘటనలను ఇటీవల జరిగిన ఓ రివ్యూలో మంత్రి హరీశ్​కు అధికారులు వివరించారు. హాస్పిటల్​ సిబ్బంది, కొంత మంది డాక్టర్లు కావాలని పేషెంట్లను ప్రైవేటుకు పంపిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్​ చేయిస్తామని కొందరిని, సర్కారు దవాఖాన్లలో చికిత్స బాగాలేదని భయపెట్టి తరలిస్తున్నట్టు వివరించారు. దీంతో హాస్పిటళ్లలోని వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వారిపై నిఘా పెట్టాలని మంత్రి ఆదేశించారు. నిజామాబాద్​ టీచింగ్​ హాస్పిటల్​లో గతంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఆపరేషన్​కు ముందు రోజు పేషెంట్​ను తరలించినట్టు సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన అక్కడి సూపరింటెండెంట్​, నిజామాబాద్​ సీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఇకపై అన్ని హాస్పిటళ్లలోనూ ఇదే విధానాన్ని అనుసరించాలని మంత్రి ఆదేశించారు. అలాగే, పేషెంట్​ వచ్చిన వెంటనే అతని వివరాలను ఆరోగ్యశ్రీలో అప్​లోడ్​ చేయాలని సూచించారు. దీని వల్ల అతని పేరిట, మరో హాస్పిటల్​ ఆరోగ్యశ్రీ క్లెయిమ్​ చేయడానికి వీలుండదు. దీంతో ఆరోగ్యశ్రీ పేరు చెప్పి ప్రైవేటుకు షిఫ్ట్​ చేసే కేసులకు చెక్​ పడుతుందని ఆఫీసర్లు చెప్తున్నారు.
 

బయోమెట్రిక్​ హాజరుతో జీతాలు
ప్రభుత్వ దవాఖాన్ల డాక్టర్లు, సిబ్బందికి ఇకపై బయోమెట్రిక్​ హాజరు ప్రకారమే జీతాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్​లోని ఉస్మానియా, గాంధీ, పేట్లబురుజు, నిమ్స్​లలో బయోమెట్రిక్​ విధానాన్ని ప్రారంభించింది. త్వరలోనే అన్ని హాస్పిటళ్లకు ఈ విధానాన్ని విస్తరించబోతున్నారు. అన్ని ఆస్పత్రుల్లో బయోమెట్రిక్​ విధానం అందుబాటులోకి వచ్చాక, ఈ హాజరు ఆధారంగానే జీతాలు చెల్లిస్తామని ఆఫీసర్లు చెప్తున్నారు. ప్రైమరీ హెల్త్​ సెంటర్ల నుంచి పెద్ద హాస్పిటళ్ల వరకూ అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. హాస్పిటళ్లలో డాక్టర్లు అందుబాటులో ఉన్నరా, లేరా అనేది వీటి ద్వారా నిఘా పెట్టనున్నారు. డుమ్మా డాక్టర్లకు చెక్ ​పెట్టేందుకే ఈ విధానాలను తెస్తున్నారు