రెడ్ కార్పెట్ స్వాగతాలను నిషేధించిన పాక్

రెడ్ కార్పెట్ స్వాగతాలను నిషేధించిన పాక్
  • ఖర్చుల నియంత్రణలో భాగంగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిర్ణయం

ఇస్లామాబాద్: రెడ్ కార్పెట్ స్వాగతాలను పాకిస్తాన్ రద్దు చేసింది. ఖర్చుల నియంత్రణలో భాగంగా ఈ చర్య తీసుకుంది. ప్రభుత్వ కార్యక్రమాలు, సీనియర్ అధికారులు, ఫెడరల్ మినిస్టర్ల పర్యటనల్లో రెడ్ కార్పెట్​లను ఉపయోగిస్తుండటంపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రెడ్ కార్పెట్ స్వాగతాలను ఆయన నిషేధించారు. దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, విదేశీ అధికారుల పర్యటనల్లో మాత్రం రెడ్ కార్పెట్ సంప్రదాయం కొనసాగనుంది. 

రెడ్ కార్పెట్ స్వాగతాలపై బ్యాన్​తో ప్రజా నిధులను మరింత బాధ్యతాయుతంగా ఖర్చు పెట్టొచ్చని ప్రభుత్వం తెలిపింది. పొదుపు చర్యలకే తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని గత నెలలో ప్రధాని షెహబాజ్ పేర్కొన్నారు. అందులో భాగంగా తమ జీతాలను వదులుకునేందుకు ప్రధానితో సహా కేబినేట్ సభ్యులు సిద్ధమయ్యారు. దేశ ఆర్థిక నిర్వహణను మెరుగుపరిచేందుకు పాక్‌‌ ప్రెసిడెట్ అసిఫ్ అలీ జర్దారీ కూడా జీతం, ప్రోత్సాహకాలు తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు.