బ్యాంకుల్లో క్యాష్ తిప్పలు.. చాలా చోట్ల నగదు కొరత.. రూ.10 వేల నుంచి రూ.50 వేల లోపే చెల్లింపులు

బ్యాంకుల్లో క్యాష్ తిప్పలు.. చాలా చోట్ల నగదు కొరత.. రూ.10 వేల నుంచి రూ.50 వేల లోపే చెల్లింపులు
  • రూ.లక్ష కావాలంటే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే
  • అంతకంటే ఎక్కువైతే ఆన్‌‌‌‌‌‌‌‌లైన్​ ట్రాన్సాక్షన్ చేయాలని సూచన
  • ఏటీఎంలకు నో క్యాష్​ బోర్డులు.. చేతిలో డబ్బుల్లేక జనం తిప్పలు 
  • ఇండెంట్ పెట్టినా నగదు రావట్లేదంటున్న బ్యాంకర్లు
  • ఏ పూటకాపూట డిపాజిట్లతో నెట్టుకొస్తున్న వైనం

మంచిర్యాల/నెట్​వర్క్​, వెలుగు: 
రాష్ట్రవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా జనం తిప్పలు పడుతున్నారు. బ్యాంకు అకౌంట్లలో లక్షల రూపాయలు ఉన్నప్పటికీ పైసలు తీసుకోలేక పరేషాన్ అవుతున్నారు. యూపీఐ, ఆన్​లైన్​ చెల్లింపులు మరింత పెంచడానికి బ్యాంకులు క్యాష్ లిమిట్ పాటించాలంటూ ఆర్బీఐ నుంచి వచ్చిన ఆదేశాలే ఇందుకు కారణం. దీంతో బ్యాంకులు నగదు విత్​డ్రా విషయంలో ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కొన్ని బ్యాంకుల్లో రోజుకు రూ.10 వేలు,  రూ.20 వేలు మాత్రమే విత్​ డ్రాకు అనుమతిస్తుండగా, మరికొన్ని బ్యాంకుల్లో రూ.50 వేల వరకు ఇస్తున్నారు. రూ.లక్ష క్యాష్ కావాలంటే ముందురోజు బ్యాంకుకు వెళ్లి అధికారులను వేడుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది.

రూ.లక్ష పైన అవసరమైతే అంత డబ్బు లేదంటూ చేతులెత్తేస్తున్నారు. ఎవరికైతే పైసలు ఇవ్వాలో వారి అకౌంట్​కు ఆన్​లైన్​ ట్రాన్సాక్షన్ చేయాలని సూచిస్తున్నారు. ఫలితంగా మార్కెట్లో క్యాష్ ఫ్లో తగ్గిపోతున్నది. మరోవైపు చాలా చోట్ల  నగదు లేక ఏటీఎంలు బోసిపోతున్నాయి. డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నిస్తే ‘నో క్యాష్’ అని చూపకుండా ‘ట్రాన్సాక్షన్ డిక్లైన్డ్’ అని చూపిస్తున్నాయి. ఇలా రైతులు, చిరువ్యాపారులు, పెన్షనర్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న బ్యాంకర్లు... లీడర్లు, రియల్టర్లు, ఆఫీసర్లు, బడా వ్యాపారులకు మాత్రం ఎంతంటే అంత నగదు చెల్లిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు..


బ్యాంకర్ల ఆంక్షల వల్ల రైతులు,  చిరువ్యాపారులు, పెన్షనర్లతో పాటు వివిధ వర్గాలకు చెందిన సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వానాకాలం పంటల సాగు సీజన్ కావడంతో దుక్కులు, విత్తనాలు, ఎరువులు, ఇతర పెట్టుబడులకు రైతులకు డబ్బుల అవసరం ఏర్పడింది. 

ఇటీవలే పత్తి, వడ్ల పైసలు రైతుల అకౌంట్లలో జమయ్యాయి. అలాగే రైతు భరోసా పైసలు పడ్డాయి. ఇదే టైమ్​లో క్రాప్ లోన్లు సాంక్షన్ చేస్తున్నారు. ఆ డబ్బులు డ్రా చేసుకుందామని బ్యాంకులకు పోతే కొన్ని చోట్ల రోజుకు రోజుకు రూ.10 వేలు, రూ.20 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. రూ.లక్ష కావాలంటే నాలుగైదు రోజులు పనీపాటా పక్కనపెట్టి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మరోవైపు పెండ్లిళ్లు, శుభకార్యాల ఖర్చుల కోసం చేతిలో నగదు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నేటికీ చాలామంది రైతులు, పెన్షనర్లు, నిరక్షరాస్యుల దగ్గర స్మార్ట్ ఫోన్లు లేవు. ఫోన్ పే, గూగుల్ పే వంటివి ఉపయోగించడం రాదు. అది తెలిసిన వాళ్ల సాయం తీసుకుందామంటే ఎవరిని నమ్మాలో అర్థంకాని పరిస్థితి. కొన్ని స్కూళ్లు, హాస్పిటళ్లలో ఆన్లైన్ చెల్లింపులు స్వీకరించకపోవడం ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా ఆస్తుల క్రయవిక్రయాల టైమ్లో అమ్మకందారులు నగదు కావాలని పట్టుబడుతున్నారు. 

డిపాజిట్లతో సర్దుబాటు.. 

ప్రతి నెలా ఫస్ట్ వీక్​లో ఉద్యోగులు జీతాలు, పెన్షనర్లు పెన్షన్ డబ్బులు డ్రా చేస్తుండడంతో పెద్ద మొత్తంలో నగదు అవసరమవుతోంది. కానీ బ్యాంకుల్లో సరిపడా క్యాష్ అందుబాటులో ఉండడం లేదు. ఏ బ్యాంకు,  ఏ బ్రాంచికి ఎంత నగదు ఇవ్వాలనే విషయమై ఆర్బీఐ గైడ్​లైన్స్ జారీ చేసిందని, ఆ మేరకే చెస్ట్ బ్యాంకుల నుంచి సప్లై చేస్తున్నారని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో వచ్చిన డబ్బుల్లో ఎంత నిల్వ ఉందో చూసుకొని మరుసటిరోజు లావాదేవీలకు కావాల్సిన నగదు కోసం ఇండెంట్ పెడుతున్నారు. ఒక బ్రాంచికి రూ.10 లక్షలు అవసరమైతే రూ.ఐదారు లక్షలు మాత్రమే వస్తున్నట్టు బ్యాంకర్లు వెల్లడిస్తున్నారు.

దీంతో మెజారిటీ బ్యాంకుల్లో రోజువారి డిపాజిట్ల డబ్బును రొటేషన్ చేస్తున్నామని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే... పలు బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడంతో దాని ఎఫెక్ట్ డిపాజిట్లపై పడుతున్నట్టు తెలుస్తోంది. గతంలో డిపాజిట్లపై 8.5 శాతం ఇంట్రెస్ట్ ఉండగా, దానిని 6.5 పర్సెంట్​కు తగ్గించడం, వడ్డీ ఆదాయంపై ఇన్కమ్ టాక్స్ వసూలు చేయడం వల్ల బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేయడానికి జనాలు 
వెనుకాడుతున్నారు. 


బడా వ్యాపారులకు అడిగినంత.. 
ఎస్బీఐ, యూబీఐతో పాటు హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, పీఎన్బీ వంటి బ్యాంకులు భారీ ట్రాన్జాక్షన్లు నిర్వహించే బడా వ్యాపారులకు ఎంతంతే అంత నగదు చెల్లిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక మిగిలిన బ్యాంకులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని బ్రాంచిల్లో రైతులు, చిరువ్యాపారులకు రూ.10 వేల నుంచి రూ.50 లోపు మాత్రమే చెల్లిచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


చలా‘మణి’ తగ్గించడమే లక్ష్యమా? 


 కేంద్ర ప్రభుత్వం బ్లాక్ మనీని కంట్రోల్ చేయడంలో భాగంగా యూపీఐ, ఆన్​లైన్ ట్రాన్జాక్షన్లను ఎంకరేజ్ చేస్తోంది. దీనికి అనుగుణంగా ఆర్బీఐ బ్యాంకులకు గైడ్​లైన్స్​ జారీ చేస్తోంది. అలాగే ఫేక్ కరెన్సీని కంట్రోల్ చేయడంలో భాగంగా త్వరలోనే ప్లాస్టిక్  కరెన్సీని తీసుకురాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో మార్కెట్లో ఉన్న నగదు చలామణిని గణనీయంగా తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం కావచ్చని అనుమానిస్తున్నారు.


ఏ జిల్లాలో చూసినా ఇదే సీన్​.. 


    మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఎస్బీఐ, సీసీసీ యూనియన్ బ్యాంక్​లో రోజుకు రూ.10 వేలు మాత్రమే ఇస్తున్నారు. శ్రీరాంపూర్ ఎస్బీఐ పక్కన గల ఏటీఎంను ఐదు నెలల నుంచి ఓపెన్ చేయడం లేదు. దీంతో ఈ ప్రాంతంలోని సింగరేణి కార్మికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జన్నారం యూబీఐ, ఎస్బీలలో నగదు కొరత వల్ల రూ.20 వేల వరకు చెల్లిస్తున్నారు.
    ఖమ్మం జిల్లాలో లక్ష రూపాయలు డ్రా చేయాలంటే ఒక రోజు ముందుగా సమాచారం ఇవ్వాలని బ్యాంకు అధికారులు చెప్తున్నారు.  గతంలో ఏ టైంలో వెళ్లినా రూ.5 లక్షల వరకు  నగదు ఇచ్చేవారు. కానీ మూడు నెలల నుంచి లక్ష రూపాయలు కావాలన్నా ఒక రోజు ముందే చెప్పాలంటున్నారు. లేదంటే చెక్, నెఫ్ట్ ట్రాన్సక్షన్స్ చేయాలని సూచిస్తున్నారు. మరోవైపు ఏటీఎంలలో  కూడా రోజువారీ ట్రాన్సక్షన్స్ 20 వేల వరకు లిమిట్​పెడ్తున్నారు. 

    ఆదిలాబాద్​ జిల్లావ్యాప్తంగా నగదు కొరత తీవ్రంగా ఉంది.  గుడిహత్నూర్ మండల కేంద్రంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో బుధవారం రైతులు బారులుతీరారు.  నగదు కొరత ఉండడంతో ఒక్కొక్కరికి రూ.20వేల వరకే అనుమతిచ్చారు. లక్ష రూపాయాలు కావాలంటే ఐదురోజులు వరుసగా బ్యాంకుకు రావాల్సి వస్తోందని అందువల్లే క్యూలైన్లు పెరిగిపోయాయని అధికారులు చెప్తున్నారు. 

    భూపాలపల్లి జిల్లాలో రైతులు పదిరోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా చేతికి డబ్బు అందడంలేదు. క్యూలో ముందున్న పది, పదిహేను మంది రైతులకే నగదు దొరుకుతుండడంతో వెనుకాల ఉన్నవారు నిరాశగా వెనుదిరుగుతున్నారు. 
    కరీంనగర్​ జిల్లాలోనూ అనేక బ్యాంకుల్లో నగదు కొరత తీవ్రంగా ఉంది. రోజుకు రూ.10 వేల వరకే  క్యాష్​ ఇస్తున్నారు.  ఏటీఎంలు సైతం ఎక్కడికక్కడ మూతపడ్డాయి. దీంతో పనులు వదిలిపెట్టి  వ్యవసాయ పెట్టుబడుల కోసం   రావాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. 

    నిర్మల్ జిల్లాలోని అన్ని మండలాలు, ప్రధాన గ్రామాల్లోని గ్రామీణ బ్యాంకు లు నగదు కొరత కారణంగా ఐదు నుంచి పది వేలు నగదు మాత్రమే ఇస్తున్నాయి. నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల్లోని ఎస్బీఐ లలో మాత్రం లక్ష లోపు నగదు ఇస్తున్నారు. 
    కామారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో ప్రతి రోజూ ఒక్కొక్కరికి ₹10 వేల నుంచి ₹20 వేల వరకే ఇస్తున్నారు. అదే పట్టణ ప్రాంతాల్లోని ప్రైవేట్ బ్యాంకుల్లో మాత్రం లక్ష, అంతకు మించి ఇస్తున్నారు. వ్యవసాయ సీజన్​ ప్రారంభమైన తరుణంలో రైతులపై ఇలా వివక్ష చూపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.  

    మహబూబాబాద్ జిల్లాలో అన్ని మండలాల్లో క్యాష్​ కొరత తీవ్రంగా ఉంది.  కురవి మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ లో బుధవారం రూ.25వేలు ఇవ్వడానికి గంటల కొద్దీ వేయిట్​చేయించారు. లక్షరూపాయలు కావాలంటే సాధ్యం కాదని  చెప్పేస్తున్నారు.  రోజూ వచ్చి కొద్ది కొద్దిగా తీసుకెళ్లాలని సలహా ఇస్తున్నారు. చెస్ట్​ బ్యాంక్​ నుంచి క్యాష్​ రావడం లేదని,  ఎవరైనా నగదు డిపాజిట్​ చేస్తే  మరొకరికి ఇస్తున్నామని ​ సిబ్బంది చెప్తున్నారు. 

10 రోజులుగా తిరుగుతున్నా..  పైసలు ఇస్తలేరు..
వ్యవసాయ పనులు మొదలైనయ్​. కూలీలు, ఎరువుల కోసం పైసలు కావాలని బ్యాంకుకు పోతే రోజుకు రూ.10వేలే ఇస్తున్నరు. 10 రోజులుగా తిరుగుతున్నా చేతికి డబ్బు అందడం లేదు. లైన్‌‌‌‌లో నిలబడితే ముందున్న వారికే డబ్బులు అయిపోతున్నయి. అది కూడా ఒక్కొక్కరికి రూ. 10వేలకు మించి ఇవ్వడం లేదు. నా అకౌంట్‌‌‌‌లో క్రాప్ లోన్ పైసలు రూ.1,50,000 జమ అయ్యాయి. పని వదిలి పెట్టుకొని 15 రోజులు తిరిగితే గానీ ఆ పైసలు చేతికొచ్చేలా లేవు. రైతులకు లిమిట్ లేకుండా పైసలు ఇయ్యాలె.
- రాస సమ్మయ్య, రైతు, పోచంపల్లి, జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి జిల్లా


పంట అమ్మిన పైసలూ ఇస్తలేరు.. 
పంట అమ్మిన పైసలు నా అకౌంట్‌‌‌‌లో పడ్డయి. వాటి కోసం బ్యాంకుకు పోతే రోజుకు రూ.20 వేలు మాత్రమే ఇస్తున్నరు. బ్యాంకులో డబ్బులు లేవని, తర్వాత రావాలని చెబుతున్నరు. అత్యవసరమైతే ఆన్ లైన్‌‌‌‌లో ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలని అంటున్నారు. రోజుకు రూ.20వేలే ఇస్తే ఎన్ని రోజులు బ్యాంకుల చుట్టూ తిరగాలో అర్థం కావడం లేదు.
- చిక్కుడు చెంద్రం, రైతు, తుక్కాపూర్, సిద్దిపేట జిల్లా 


 రూ.10వేలే ఇస్తమంటున్నరు
పొలం దున్నాలని పైసల కోసం బ్యాంకుకు పోతే రూ.5 వేలు..10 వేలు మాత్రమే ఇస్తున్నరు.. దీంతో పనులు వదిలిపెట్టి  వ్యవసాయ పెట్టుబడుల కోసం బ్యాంకు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అత్యవసరం ఉండి ఒకేసారి రూ.50 వేలో, రూ.లక్షనో కావాలంటే క్యాష్‌‌‌‌ లేవంటున్నరు. 
- మల్లారెడ్డి, రైతు, గూడటిపల్లి, శంకరపట్నం, కరీంనగర్ 


‘రేపు’ రమ్మంటున్నరు..

నేను మూడెకరాల్లో మక్క, పెసర పంటలు సాగు చేశాను. వ్యవసాయ పనులకు అవసరమైన ఖర్చుల కోసం కోరుట్లలోని యూనియన్ బ్యాంకుకు వెళ్లి రూ.30 వేల క్రాప్‌‌‌‌ లోన్‌‌‌‌ కావాలని అడిగిన. కానీ బ్యాంకులో పైసలు లేవని, చెప్పి 'రేపు రండి' అంటూ వెనక్కి పంపిస్తున్నారు. ఇలా ఒక రోజు కాదు, చాలారోజులుగా తిరగాల్సి వస్తోంది. వ్యవసాయ పనులు మొదలు కావడంతో విత్తనాలు, ఎరువులు, మందులు కొనేందుకు డబ్బులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. - కుడుదుల స్వామి, సంగెం, కోరుట్ల, జగిత్యాల జిల్లా

  • రూ.లక్ష కావాలంటే ఒక్కరోజు ముందే చెప్పాలట

నాకు వీఎం బంజరు ఎస్‌‌‌‌బీఐలో అకౌంట్‌‌‌‌ ఉంది. రూ.లక్ష రూపాయలు డ్రా చేయాలంటే ఒకరోజు ముందుగా చెప్పాలని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. గతంలో రూ.5 లక్షల వరకు ఏ టైంలో వెళ్లి అడిగినా నగదు ఇచ్చేవారు. కానీ మూడు నెలల నుంచి రూ.లక్ష కావాలన్నా ఒకరోజు ముందే చెప్పాలంటున్నారు. లేదా చెక్, నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఏటీఎంలలో కూడా రోజువారి ట్రాన్సాక్షన్స్ రూ.20 వేల వరకే అంటూ బోర్డులు పెడుతున్నారు.   - అన్నపూర్ణ, వీఎం బంజర, ఖమ్మం జిల్లా