కాకతీయ జూపార్క్ కు కాలుష్యం కష్టాలు..పార్క్ మధ్యలోనే నిలుస్తున్న మురుగు నీరు

కాకతీయ జూపార్క్ కు కాలుష్యం కష్టాలు..పార్క్ మధ్యలోనే నిలుస్తున్న మురుగు నీరు
  • రూ.కోటితో చేపట్టిన డ్రైనేజీ పనులను మధ్యలో వదిలేసిన కాంట్రాక్టర్‍
  • దుర్వాసన, కాలుష్యంతో అనారోగ్యం బారిన మూగజీవాలు
  • ఇప్పటికే చనిపోయిన వైట్ టైగర్, హైదరాబాద్ కు మరో రెండు పులుల తరలింపు

వరంగల్, వెలుగు : వరంగల్ నగరంలోని కాకతీయ జూపార్క్ కాలుష్యం కోరల్లో చిక్కుకుంటోంది. చుట్టూరా ఉన్న కాలనీల నుంచి వచ్చే మురుగు నీరంతా పార్క్ లోకే చేరుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు మొదలుపెట్టిన డ్రైనేజీ కాల్వ నిర్మాణ పనులను సదరు కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేసి వెళ్లాడు. దీంతో మురుగు నీరంతా జూపార్క్ లోనే నిల్వ ఉంటూ తీవ్ర దుర్వాసన వెదజల్లడంతో పాటు పరిసరాలు కలుషితం అవుతున్నాయి. వాతావరణం సరిపడగా కొన్ని జీవాలు మృత్యువాత పడుతుండగా, మరికొన్ని అనారోగ్యం బారిన పడుతున్నాయి.

కాలనీల మురుగునీరంతా జూపార్క్ లోకే...

హనుమకొండ హంటర్ రోడ్డులో సుమారు 48 ఎకరాల విస్తీర్ణంలో 1985లో ఈ జూపార్క్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం కొంత లోతట్టు ప్రాంతం కావడంతో చుట్టూరా ఉంటే అడ్వకేట్స్ కాలనీ ఫేజ్ 1 నుంచి మొదలుకొని ఫేజ్‍ 4, 5 వరకు, బాలసముద్రం, వడ్డెర కాలనీ, వరంగల్‍ పబ్లిక్‍ స్కూల్‍ చుట్టూరా కాలనీల నుంచి వచ్చే మురుగు నీరంతా జూపార్కులోకే చేరుతోంది. ఇవేగాక రాజ్‍ హోటల్‍, విష్టుప్రియ గార్డెన్‍ ఏరియా, దీన్‍దయాల్‍ కాలనీ వంటి దాదాపు 25 కాలనీల మురుగు డ్రైనేజీల ద్వారా జూపార్క్ మధ్యలో నుంచి పద్మాక్షి గుట్ట ప్రాంతాలకు తరలివెళ్తోంది. మురుగు నీటి కారణంగా తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో పార్కులో సేద తీరేందుకు వచ్చే పర్యాటకులు ముక్కులు మూసుకుని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మధ్యలోనే ఆగిన డ్రైనేజీ పనులు

జూపార్క్ అభివృద్ధిపై అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి స్పెషల్‍ ఫోకస్‍ పెట్టారు. సుమారు రూ. 2 నుంచి రూ. 3 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో ప్రధానంగా మురుగునీటి సమస్యను పరిష్కరించేందుకు రూ.కోటి నిధులతో డ్రైనేజీ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. కానీ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‍ డ్రైనేజీ నిర్మాణ పనులను పూర్తి చేయకుండా మధ్యలోనే ఆపేశాడు. దీంతో కాలనీల నుంచి వచ్చే మురుగు నీరంతా జూపార్క్ లోనే నిలిచిపోతోంది. వర్షాలు పడితే పై నుంచి వచ్చే వరదతో జూపార్క్ నిండిపోయే ప్రమాదం ఉంది. 

ప్రాణాలు కోల్పోతున్న మూగజీవాలు

మురుగు నీరంతా జూపార్క్ లోనే నిలిచి పోతుండడంతో అక్కడి గాలి, నీరు, నేల, గడ్డి కలుషితం అవుతోంది. అడవి జంతువులకు అవసరమైన గడ్డిని ఇదే పార్కులో పెంచుతున్నారు. మురుగు నీటి కారణంగా గడ్డి కలుషితం కావడం, తీవ్ర దుర్వాసనతో మూగజీవాలు అనారోగ్యం బారిన పడుతున్నాయి. గతంలోనే ఓ తెల్ల పులి చనిపోగా, కరీనా, శంకర్‍ పేరు గల మరో రెండు పులులు అనారోగ్యానికి గురయ్యాయి. దీంతో వాటిని హైదరాబాద్ లోని జూకు తరలించారు. అలాగే జూపార్క్ లోని జింకలు, కొండ గొర్రెలు, పక్షులు సైతం అనారోగ్యం బారిన పడి చనిపోయినట్లు తెలుస్తోంది. 

చెత్త సేకరణకు సహకరించని మున్సిపాలిటీ...

జూపార్క్ 48 ఎకరాలు ఉండడంతో ఆకుల, కొమ్మలు రాలి ప్రతి రోజు పెద్ద ఎత్తున చెత్త పోగుపడుతోంది. ఈ సమస్యను జూ ఆఫీసర్లు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లడంతో జూపార్క్ లోని చెత్తను మున్సిపల్ ట్రాక్టర్ల ద్వారా బయటకు తీసుకెళ్లడంతో పాటు డ్రైనేజీ వ్యవస్థను క్లీన్ చేసే బాధ్యతను అప్పగించారు. కానీ మొదట్లో సహకరించిన మున్సిపల్ సిబ్బంది.. ఇటీవల స్పందించడం మానేశారు. ఎప్పుడో ఒకసారి మొక్కుబడిగా వస్తూ చెత్తను తీసుకెళ్తున్నారు. 

కాలుష్యంతో ఇబ్బందులు వాస్తవమే.. 

జూపార్కులో వాతావరణ కాలుష్యం ఉన్న మాట వాస్తవమే. గతంలో చేపట్టిన డ్రైనేజీ నిర్మాణ పనులు వివిధ కారణాలతో ఆగిపోవడంతో నీరంతా జూపార్క్ లోనే ఆగిపోతోంది. డీసిల్టేషన్ ఇబ్బంది ఉంది. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తాం

- బి.మయూరి జూపార్క్ అసిస్టెంట్ క్యూరేటర్–