ధరణి అక్రమాల్లో వెనక ఉండి నడిపించిందెవరు? అధికారులది 5% .. బ్యాక్ ఎండ్ పెద్దలది 95%

ధరణి అక్రమాల్లో వెనక ఉండి నడిపించిందెవరు? అధికారులది 5% .. బ్యాక్ ఎండ్ పెద్దలది 95%
  • ధరణి అక్రమాల్లో  వాళ్లదే అసలు కథ
  • అప్పటి ఉన్నతాధికారులు.. ప్రభుత్వ పెద్దల పాత్రపై క్షుణ్నంగా విచారణ
  • పోలీసు సైబర్ ఎంక్వైరీ రిపోర్ట్ తర్వాతే ముందుకు
  • భూ భారతికి అప్పటి కోడ్‌‌‌‌నే వాడటంతో మళ్లీ మొదటికి సమస్య
  • ఇటీవల డేటా హ్యాక్ చేసి  కొన్ని భూముల వివరాలు మార్చినట్టు ప్రాథమికంగా నిర్ధారణ

హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్ అక్రమాల వెనుక అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరనే దానిపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా  చర్చ నడుస్తోంది.  గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పోర్టల్ కేవలం కొందరు పెద్దల స్వార్థ ప్రయోజనాల కోసమే అస్త్రంగా మారిందా? అనే అనుమానాలు నిజమవుతున్నాయి. ఫోరెన్సిక్​ ఆడిట్‌‌‌‌లో వెల్లడైన వివరాలు, ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌యూపీ ( ల్యాండ్​ రికార్డ్స్​ అప్​గ్రేడేషన్​ ప్రోగ్రామ్​)లో రికార్డులను పోల్చి ఎక్కడ ప్రభుత్వ  , అసైన్డ్, ఎండోమెంట్​​ భూముల పేర్లు మారాయనే దానిపై లోతుగా స్టడీ చేస్తున్నారు.   ప్రాథమిక విచారణలో తేలుతున్న అంశాల ప్రకారం.. ధరణి పోర్టల్​ బ్యాక్​ ఎండ్​ భాగోతం కుంభకోణంలో కిందిస్థాయి అధికారుల పాత్ర కేవలం 5 శాతమే కాగా, తెరవెనుక ఉండి నడిపించిన ‘పెద్దల’ పాత్ర ఏకంగా 95 శాతంగా ఉందని తెలుస్తోంది.

వేల ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్, నిషేధిత భూములను ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి మళ్లించిన వైనంపై ఇప్పుడు దర్యాప్తు ముమ్మరమైంది. ఎవరైతే అప్పటి ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు టెర్రాసిస్​  కంపెనీ ముసుగులో డేటాను తమ గుప్పిట్లోకి తీసుకున్నారో, వారే ఈ తారుమారు పర్వానికి ఒడిగట్టినట్లు బలమైన ఆధారాలు లభ్యమవుతున్నాయి. తాజాగా పోలీసు సైబర్ ఎంక్వైరీ రిపోర్ట్ సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఈ నివేదిక ఆధారంగా త్వరలోనే అసలు తిమింగలాల పేర్లు బయటకు రానున్నాయని సెక్రటేరియెట్‌‌‌‌వర్గాల్లో   వినిపిస్తోంది. అంతేకాదు, గతంలో ధరణిని నడిపించిన కోడ్‌‌‌‌నే ప్రస్తుత ‘భూ భారతి’ పోర్టల్‌‌‌‌కు కూడా వాడటంతో, పాత నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను ఉపయోగించి డేటాను హ్యాక్ చేసి ఇప్పుడు కూడా భూముల వివరాలు మార్చినట్టు వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది.

 తెరవెనుక నడిపిన అసలు కథ ఇదే!

ధరణి పోర్టల్‌‌‌‌లో జరిగిన భూముల మార్పిడి వ్యవహారంలో జిల్లాల్లోని తహసీల్దార్లు, ఆర్డీవోల పాత్ర చాలా పరిమితమని, అంతా పైస్థాయిలోనే నడిచిందని విశ్వసనీయ సమాచారం. క్షేత్రస్థాయిలో  గతంలో ధరణి పోర్టల్‌‌‌‌లో ఎమ్మార్వో, ఆర్డీవో, అడిషనల్​ కలెక్టర్​ ఎవరికీ ఎలాంటి అధికారాలు లేవు. భూ భారతి వచ్చాక లాగిన్‌‌‌‌లు ఇచ్చారు.

అయితే కొంతమంది అధికారులు క్షేత్రస్థాయిలో ఫిజికల్​ రికార్డులను సర్దుబాటు చేశారే తప్ప.. పోర్టల్‌‌‌‌లో​ వారి పాత్ర శూన్యంగా ఉన్నట్లు తెలిసింది.  మిగిలిన 95 శాతం అక్రమాలు  ఐటీ బ్యాక్‌‌‌‌ఎండ్ లాగిన్ల ద్వారానే సాగాయని తేలింది. అప్పటి ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఇద్దరు ముగ్గురు కీలక ఉన్నతాధికారులు,  అప్పటి ప్రభుత్వ పెద్దలు కలిసి ఈ ల్యాండ్ క్లియరింగ్ మాఫియాను నడిపించినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

సాధారణంగా కలెక్టర్లకు లేదా సీసీఎల్‌‌‌‌ఏకు మాత్రమే ఉండాల్సిన ‘ఎడిట్’ ఆప్షన్లు, ప్రత్యేక అధికారాల కీస్ అప్పట్లో ఒక ప్రైవేట్ ఏజెన్సీ చేతుల్లో ఎందుకు ఉన్నాయనే దానిపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. నిషేధిత జాబితా (22-ఏ)లో ఉన్న విలువైన భూములను సైతం రాత్రికి రాత్రే ఆ జాబితా నుంచి తొలగించి, ప్రైవేట్‌‌‌‌ రియల్​ ఎస్టేట్​ డెవలపర్లకు అనుకూలంగా మార్చడం వెనుక వందల కోట్ల రూపాయలు చేతులు మారాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఉన్నతాధికారుల పాత్రపైనే విచారణ 

పేదలకు సాగు కోసం ఇచ్చిన అసైన్డ్ భూములు, దేవాదాయ, వక్ఫ్ బోర్డులకు చెందిన స్థలాలు, చివరకు ప్రభుత్వ కామన్ ల్యాండ్స్‌‌‌‌ను సైతం ధరణి ద్వారా అక్రమంగా వేరేవాళ్ల పేర్లపైకి మార్చేశారు.  ఏయే సర్వే నంబర్లలో భూముల స్వభావాన్ని మార్చారు? ఏయే ఐపీ అడ్రస్‌‌‌‌ల నుంచి ఈ మార్పులకు సంబంధించిన అప్రూవల్స్ వచ్చాయి? అనే డేటాను ప్రస్తుతం పోలీసు సైబర్​ టీమ్ సేకరిస్తున్నది.

నిబంధనల ప్రకారం ల్యాండ్ పార్సిల్స్ మార్చేటప్పుడు క్షేత్రస్థాయి పరిశీలన నివేదికలు ఉండాలి. కానీ ధరణిలో ఎలాంటి భౌతిక రికార్డులు లేకుండానే  ఫైళ్లు క్లియర్ అయిపోయాయి.  క్లైమాక్స్‌‌‌‌కు చేరిన దర్యాప్తు ధరణి పోర్టల్ లోపాలు..  డేటా మార్పులపై రాష్ట్ర పోలీసు సైబర్ విభాగానికి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. సైబర్ క్రైమ్ నిపుణులు ప్రస్తుతం ధరణి సర్వర్ల లాగ్ డేటాను, ఐటీ ఆర్కిటెక్చర్‌‌‌‌ను లోతుగా పరిశీలిస్తున్నారు.

ఈ రిపోర్ట్ వచ్చిన వెంటనే కఠిన చర్యలు ఉంటాయని తెలుస్తోంది. డిజిటల్ రికార్డులను మార్చడానికి వాడిన ఎన్‌‌‌‌క్రిప్షన్ కీస్ ఎవరి అధీనంలో ఉన్నాయి? ప్రైవేట్ వ్యక్తులకు డేటాబేస్ యాక్సెస్ ఎలా లభించింది? అనే కోణంలో ఫోరెన్సిక్ ల్యాబ్స్ సహాయంతో విచారణ సాగుతోంది. ఈ సైబర్ నివేదిక చేతికి అందితే, తెరవెనుక ఉండి క్లిక్‌‌‌‌లు, డిజిటల్​ సిగ్నేచర్‌‌‌‌‌‌‌‌లు, అసలు ఐపీ అడ్రస్‌‌‌‌లు ఎవరి పేరుతో ఉన్నాయో స్పష్టమైన సాక్ష్యాలతో సహా రుజువవుతుంది.

కేవలం రాజకీయ కక్ష సాధింపులు అనే విమర్శలకు తావివ్వకుండా, పూర్తి సాంకేతిక ఆధారాలతో బయట పెట్టాలనేది   ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ రిపోర్ట్ ఆధారంగానే ఇటు క్రిమినల్ కేసులు,   దర్యాప్తు సంస్థల రంగప్రవేశానికి కూడా మార్గం సుగమం కానుందని సెక్రటేరియెట్‌‌‌‌ వర్గాలు వెల్లడించాయి.

 పాత కోడ్‌‌‌‌తో ‘భూ భారతి’ హ్యాకింగ్ 

ధరణి స్థానంలో పారదర్శకత కోసం ప్రస్తుత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘భూ భారతి’ పోర్టల్‌‌‌‌కు కూడా పాత ధరణి కోడ్‌‌‌‌నే వాడటం ఇప్పుడు పెద్ద శాపంగా మారింది. గతంలో ధరణి ల్యాండ్ పోర్టల్ సాఫ్ట్‌‌‌‌వేర్ డిజైన్ చేసిన టెక్నికల్ టీమ్, అదే కోడింగ్ లూప్‌‌‌‌హోల్స్‌‌‌‌ను ఉపయోగించి ఇప్పుడు కూడా డేటాను హ్యాక్ చేస్తున్నట్టు ప్రస్తుతం భూ భారతి పోర్టల్​ నిర్వహిస్తున్న ఎన్‌‌‌‌ఐసీ విభాగం గుర్తించింది.

ఈ పాత కోడ్ ద్వారా పోర్టల్ బ్యాక్ ఎండ్‌‌‌‌లోకి చొరబడి, నిశ్శబ్దంగా కొన్ని వివాదాస్పద భూముల వివరాలను, మ్యుటేషన్ రికార్డులను మార్చేస్తున్నట్టు తెలిసింది. దీంతో కొత్త పోర్టల్ తీసుకొచ్చినా ప్రయోజనం లేకుండా పోతోందని, పాత మాఫియానే కొత్త సర్వర్‌‌‌‌ను కూడా నియంత్రిస్తోందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. ల్యాండ్ రికార్డుల భద్రతకు సంబంధించి ఇదొక పెద్ద సైబర్ సెక్యూరిటీ వైఫల్యంగా భావిస్తున్న అధికారులు, తక్షణమే ఈ కోడింగ్ వ్యవస్థను పూర్తిగా మార్చాలని నిర్ణయించారు. ఇన్నాళ్లూ జరిగిన అక్రమాలు ఒకెత్తయితే, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పాత కోడ్ సాయంతో ల్యాండ్ రికార్డులను మార్చడం అనేది రెవెన్యూ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది.