
జైపూర్: రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక కుల గణన నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. దేశంలోని దళితులు, బీసీలు తమ వాస్తవ సంఖ్యను తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నందున కుల గణన అవసరమని ఆయన స్పష్టంచేశారు. ఈమేరకు రాహుల్ బుధవారం రాజస్థాన్‌లోని ధోల్‌పూర్, భరత్‌పూర్‌లలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో పాల్గొని మాట్లాడారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ తనను తాను ఓబీసీ అని చెప్పుకునేవారని, కుల గణన చేయాలని తాను డిమాండ్ చేయగానే ఆయన మాట మార్చారని చెప్పారు. దేశంలో ఒకే ఒక కులం ఉందని, అదే పేదరికమని ఇప్పుడు చెబుతున్నారని రాహుల్ విమర్శించారు. మోదీ, అదానీ, అమిత్ షా ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారని ఆరోపించారు.
‘‘మోదీ ముందు నుంచి వస్తున్నారు.. టీవీల్లో కనిపిస్తూ హిందూ-ముస్లింల గురించి మాట్లాడి మీ దృష్టిని మళ్లిస్తుంటే అదానీ వెనుక నుంచి వచ్చి మీ జేబులు గుల్ల చేస్తున్నాడు. ఎవరైనా ప్రశ్నించాలని చూస్తే చేతిలో కర్రతో అమిత్ షా మరోవైపు నుంచి చూస్తున్నాడు. ఇదీ మన దేశంలో ప్రభుత్వం నడుస్తున్న విధానం” అని రాహుల్ చెప్పారు. దేశానికి సేవ చేయాలనుకునే యువకుల కలలను అగ్నిపథ్ ద్వారా మోదీ చెదరగొట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ఏంచేసినా పేదల కోసమే చేస్తుంది.. మోదీ సర్కారు మాత్రం అదానీ సహా ఇద్దరు ముగ్గురు బడా పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తుంది. అదానీ ప్రభుత్వం కావాలో, సామాన్యుల ప్రభుత్వం కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని రాహుల్కోరారు. యూపీఏ హయాంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.400 లకు చేరిందని మోదీ గగ్గోలు పెట్టారని, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారని గుర్తుచేశారు. అదే సిలిండర్ ధర ఇప్పుడు రూ.1200లకు చేరినా ప్రధాని మోదీ నోరు మెదపడం లేదని రాహుల్ గాంధీ విమర్శించారు.