
- ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో భట్టి విక్రమార్క
- నేతల విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం
హైదరాబాద్, వెలుగు : కులగణన సర్వేలో ప్రభుత్వ టీచర్లను భాగస్వాములను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తో కలిసి బుధవారం ఆయన సెక్రటేరియెట్లో ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. సర్వే ప్రాధాన్యత, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనను వివరించారు. టీచర్లు సామాజిక స్పృహ, గురుతర బాధ్యత ఎరిగిన వారు అని, అందుకే వారిని సర్వేలో భాగస్వామ్యం చేయనున్నట్లు తెలిపారు.
ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరినట్టు సెప్టెంబర్ 9 నుంచి 15 వరకు వరుస సెలవుల మధ్య సర్వే చేపట్టడం, ఉదయం వేళల్లో సర్వే నిర్వహించడం, సెలవు రోజుల్లో సర్వే విధుల్లో పాల్గొన్న టీచర్లకు పరిహారంతో కూడిన సెలవులు మంజూరు చేయడంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. సోషియో, ఎకనామిక్, ఎడ్యుకేషన్, పొలిటికల్, ఎంప్లాయిమెంట్ రంగాల్లో ఎవరెవరు, ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకునేందుకు సర్వే ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు.
అయితే, గత ప్రభుత్వ హయాంలో తాము సకల జనుల సర్వే చేశామని, ఆ సర్వే ఎటు పోయిందో ఎవరికీ తెలియదని ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు షౌకత్ అలీ తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం కోరుకున్న విధంగా సర్వే చేపట్టడానికి టీచర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. టీచర్లు అయితేనే సర్వే బాగా చేస్తారని తమపై నమ్మకం ఉంచినందుకు ప్రభుత్వానికి పీఆర్ టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
సర్వేలో పాల్గొనే టీచర్లకు పరిహారంతో కూడిన సెలవు మంజూరు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య కోరారు. కుల గణన సర్వేలో సంపూర్ణంగా సహకరిస్తామని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి తెలిపారు. గత ప్రభుత్వం టీచర్లకు ఆదేశాలు జారీ చేసేదని.. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమను పిలిచి, అభిప్రాయాలు తెలుసుకోవడం బాగుందని మోడల్ స్కూల్స్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండయ్య అభినందించారు.