
జైపూర్: రాజస్తాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 159 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పార్థివ్ పటేల్(67; 41 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్) మినహా ఎవరూ రాణించకపోవడంతో RCB సాధారణ స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేపట్టిన RCB ఇన్నింగ్స్ ను విరాట్ కోహ్లి, పార్థివ్ పటేల్ లు ప్రారంభించారు. అయితే టీమ్ స్కోరు 49 రన్స్ దగ్గర కోహ్లి(23) ఫస్ట్ వికెట్ గా పెవిలియన్ చేరాడు. కోహ్లి మంచి టచ్ లో కనిపించనప్పటికీ శ్రేయస్ గోపాల్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. మరో 22 పరుగుల వ్యవధిలో ఏబీ డివిలియర్స్(13) ఔటయ్యాడు.
ఆపై వెంటనే హెట్‌మెయిర్(1) సైతం పెవిలియన్ బాట పట్టాడు. 73 పరుగులకే RCB మూడు వికెట్లు కోల్పోయింది. తొలి మూడు వికెట్లను శ్రేయస్ గోపాల్ సాధించి RCB ని కష్టాల్లోకి నెట్టాడు. పార్థివ్ పటేల్ నిలకడగా ఆడి జట్టు స్కోరును చక్కదిద్దాడు. అయితే RCB స్కోరు 126 పరుగుల వద్ద పార్థివ్ నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. ఇక చివర్లో స్టోయినిస్(31 నాటౌట్), మొయిన్ అలీ(18 నాటౌట్) ఫర్వాలేదనిపించడంతో.. ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది.