లంచం అంటే గతంలో ఎంతిస్తే అంత తీసుకునే వాళ్లు.. ఏదోలే వచ్చింది.. అసలు రానిదాని కంటే ఇదే నయం అని అనుకునే వాళ్లు గతంలో.. ఇప్పుడు ట్రెండ్ మారింది. లంచం లేనిదే ఫైల్ ముట్టని సిట్యువేషన్.. సర్లే ఎలాగోలా పని అవుతుంది కదా అని అనుకుంటే.. అనధికారికంగా.. దౌర్జన్యంగా డిమాండ్ చేస్తున్నారు. లంచం ఎంత ఇవ్వాలి అనేది కూడా లంచం తీసుకునే వాడే డిసైడ్ చేస్తున్నాడు. ఇదీ మరీ టూ మచ్ అనిపిస్తుంది కదా.. మహారాష్ట్రలో ఇదే జరిగింది. ఇద్దరు GST అధికారుల అరెస్టు తర్వాత బయటపడిన విషయాలు షాకింగ్ గా మారింది. కోటిన్నర లంచం డిమాండ్ చేసిన జీఎస్టీ అధికారులు.. లంచం ఎంతో వాళ్లే డిసైడ్ చేశారంట.. చివరకు సీబీఐ ఎంట్రీతో అవినీతి అధికారులు ఇద్దరు కటకటాల పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాలో ఇద్దరు అవినీతి అధికారులు సీబీఐకి చిక్కారు. రూ.40 లక్షల లంచం కేసులో సీజీఎస్టీ అదనపు కమిషనర్ (ఐఆర్ఎస్ అధికారి), మరో జీఎస్టీ అధికారిని సీబీఐ అరెస్టు చేసింది. జీఎస్టీ అదనపు కమిషనర్ వినయ్ కుమార్ కాంతేటి, జీఎస్టీ సూపరింటెండెంట్ రాకేష్ కుమార్ సిన్హాతో మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సీబీఐ వెల్లడించింది.
రాయ్ గఢ్ జిల్లాలో ఓ వ్యక్తి గ్రానైట్ క్వారీ బిజినెస్ చేస్తున్నాడు. తన కంపెనీకి సంబంధించిన జీఎస్టీ, రాయల్టీ కేసును పరిష్కరించేందుకు అతడు రాయ్‌గఢ్ డివిజన్ CGST అడిషనల్ కమిషనర్ వినయ్ కుమార్ కాంతేటి, CGST సూపరింటెండెంట్ రాకేష్ కుమార్ సిన్హాను ఆశ్రయించాడు. పని అయిపోతుందని చెప్పిన జీఎస్టీ అధికారులు ఇందు కోసం కోటిన్నర లంచం డిమాండ్ చేశారు.
అంత భారీ మొత్తం తాను చెల్లించలేనని బాధితుడు అధికారులకు చెప్పాడు. చర్చల అనంతరం రూ.40 లక్షలకు డీల్ కుదిరింది. లంచం డబ్బులను నరీందర్ రాజ్‌పుత్ అనే వ్యక్తికి ఇవ్వాలని జీఎస్టీ అధికారులు సూచించారు. ఈ క్రమంలో లంచం ఇవ్వడం ఇష్టం లేని గ్రానైట్ కంపెనీ ఓనర్ సీబీఐని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు వ్యూహాత్మకంగా నిందితులను పట్టుకునేందుకు ప్లాన్ చేశారు.
జీఎస్టీ అధికారుల తరుఫున నరీందర్ రాజ్‌పుత్ రూ. 40 లక్షల నగదు తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అరెస్ట్ అనంతరం నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా అక్రమ ఆస్తులు, నగదు, ఆభరణాలు బయటపడ్డాయి. ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జీఎస్టీ అధికారులు లంచం కేసులో అరెస్ట్ కావడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
