హర్యానాలో మెడికల్ (MBBS, BDS) సీటు పొంది, మధ్యలో వదిలేద్దాం అనుకుంటున్నారా..? అయితే ఈ కొత్త నిబంధనలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి హర్యానా ప్రభుత్వం ప్రవేశాలు, ఫీజులు, జరిమానాలపై కఠిన మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఈ నిబంధనల ప్రకారం మెడికల్ సీట్ పొందాక మధ్యలోనే సీటు వదిలేస్తే భారీ జరిమానా, నిషేధం విధించనుంది. ప్రభుత్వ కాలేజీల్లో ఎంబిబిఎస్ లేదా బిడిఎస్ సీటులో చేరి మధ్యలో మానేస్తే, ఏకంగా రూ. 10 లక్షల జరిమానా చెల్లించాలి. అంతేకాదు, రాబోయే మూడేళ్లపాటు ఆ రాష్ట్రంలో ఎలాంటి మెడికల్ ప్రవేశాలు పొందకుండా అనర్హత వేటు వేస్తారు.
ఇక ప్రైవేట్ కాలేజీల్లో కోర్సు మధ్యలో వదిలేస్తే ఆ విద్యా సంవత్సరపు ఫీజుతో పాటు, వచ్చే విద్యా సంవత్సరపు ఫీజులో సగం (50 శాతం) చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన మేనేజ్‌మెంట్ కోటాలో చేరిన వారికీ వర్తిస్తుంది.
సీట్ల కేటగిరీ & రిజర్వేషన్లు
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లలో 15 శాతం ఆలిండియా కోటా (NEET-UG ద్వారా) కింద భర్తీ చేస్తారు. మిగతా 85 శాతం సీట్లు రాష్ట్ర విద్యార్థులకే కేటాయిస్తారు. ప్రైవేట్ కాలేజీల్లో 50 శాతం సీట్లు స్టేట్ కోటా కింద, మరో 50 శాతం సీట్లు మేనేజ్‌మెంట్ కోటా కింద భర్తీ చేస్తారు.
మేనేజ్‌మెంట్ కోటాలో 15 శాతం ఎన్నారై కోటా ఉంటుంది. ఓపెన్ మెరిట్-స్టేట్ కోటా సీట్లు కావాలంటే హర్యానా స్థానికులై ఉండాలి. అదే మేనేజ్‌మెంట్ కోటా అయితే దేశంలో ఎక్కడి వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగులకు రాష్ట్ర కోటా సీట్లలో 5 శాతం రిజర్వేషన్ ఉంటుంది.
ఫీజుల వివరాలు
*ప్రైవేట్ కాలేజీలు కోర్సు మొత్తానికీ సంబంధించిన ట్యూషన్ ఫీజును ఒకేసారి ముందుగా (ఏకమొత్తంగా) వసూలు చేయడానికి వీలేదు.
*ప్రభుత్వ కాలేజీల్లో వార్షిక ఫీజు ఎంబిబిఎస్ (5 సంవత్సరాలు) కోర్సుకు ఏడాదికి రూ. 4,22,910 ఉంటుంది.
*ప్రభుత్వ-సహాయక కాలేజీల్లో వార్షిక ఫీజు ఏడాదికి రూ. 8,10,000 ఉంటుంది.
*రిజిస్ట్రేషన్ / కౌన్సెలింగ్ ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ. 2,500, హర్యానా రిజర్వ్డ్ కేటగిరీ వారికి రూ. 1,250, ఎన్నారైలకు రూ. 10,000గా నిర్ణయించారు.
బాండ్ నిబంధనలు
*కాలేజీల్లో చేరే సమయంలో అభ్యర్థులు నిర్దిష్ట మొత్తానికి బాండ్ సమర్పించాలి:
*ప్రభుత్వ కాలేజీల పురుష అభ్యర్థులు రూ. 25,77,090, మహిళా అభ్యర్థులు రూ. 23,19,381 బాండ్ ఇవ్వాలి.
*ప్రభుత్వ-సహాయక కాలేజీలు పురుష అభ్యర్థులు రూ. 21,90,000, మహిళా అభ్యర్థులు రూ. 19,71,000 బాండ్ సమర్పించాల్సి ఉంటుంది.
