
- ఐటీ ఎక్సెంప్షన్ కమిషనర్‌గా డ్యూటీ
- ట్యాక్సేషన్ కోసం వచ్చిన కంపెనీల వద్ద భారీగా లంచాలు
- బినామీల పేర్లతో ఆస్తులు, మధ్యవర్తులతో కలెక్షన్
- లంచం కింద ముంబైలో రూ.2.5 కోట్ల విలువ చేసే ఫ్లాట్
- షాపూర్జీ పల్లోంజీ వద్ద రూ.1.20 కోట్లు డిమాండ్
- రూ.70 లక్షలతో చిక్కిన జీవన్‌లాల్ ముఠా సభ్యుడు
- జీవన్‌లాల్‌సహా 14 మందిపై కేసు, అరెస్టు
హైదరాబాద్,వెలుగు: ఇన్‌కమ్ ట్యాక్స్ కమిషనర్(ఎక్సెంప్షన్) జీవన్‌లాల్ లంచాల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ అప్పీల్ యూనిట్ 7,8కి అడిషనల్ చార్జ్ ఆఫ్ కమిషనర్ హోదాలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. మధ్యవర్తులతో లంచాలు, బినామీల పేర్లతో ఆస్తులు కూడబెట్టినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు.
మధ్యవర్తి ద్వారా రూ.70 లక్షలు లంచం తీసుకున్న కేసులో హైదరాబాద్ జోనల్ ఇన్‌కమ్ ట్యాక్స్(ఎక్సెంప్షన్) కమిషనర్ జీవన్‌లాల్‌సహా ఐదుగురిని గత శుక్రవారం సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఢిల్లీ సీబీఐ అధికారులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కీలక అంశాలను వెల్లడించారు. 2004 ఐఆర్‌ఎస్‌కు ఎంపికైన జీవన్‌లాల్..ఆదాయపు పన్ను మినహాయింపుల అప్పీళ్ల పేరుతో అక్రమాలకు పాల్పడ్డట్టు గుర్తించారు.
బినామీ గ్యాంగ్‌తో వసూళ్లు
హైదరాబాద్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ రాయపురెడ్డి నరేంద్ర, విశాఖపట్నానికి చెందిన నట్ట వీరనాగ శ్రీరామ్‌గోపాల్, శ్రీకాకుళానికి చెందిన సాయిరామ్ పెళిసెట్టితో పాటు మరికొంత మందితో బినామీ గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు. తన వద్దకు వచ్చే ప్రైవేట్‌కంపెనీల అప్పీల్స్‌ను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ట్యాక్స్ మినహాయింపుల విషయంలో అనుకూలంగా వ్యవహరించేందుకు లంచాలు వసూలు చేశారు.
ముంబైకి చెందిన ఎన్‌డీడబ్ల్యూ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి చెందిన ఏవియేషన్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు జీవన్‌లాల్ అనుకూలంగా వ్యవహరించాడు. ఇందుకోసం ఖమ్మం జిల్లాకు చెందిన దండెల వెంకటేశ్వర్లు పేరుతో ముంబైలో రూ.2.5 కోట్ల విలువ చేసే ఫ్లాట్‌ను లంచం కింద రాయించుకున్నాడు. ఈ క్రమంలోనే థాణేకు చెందిన వెంచుర సెక్యూరిటీస్ లిమిటెడ్, ముంబైకి చెందిన ఆనంద్‌రావు షిటోలి సంస్థల వద్ద రూ. 35 లక్షలు తీసుకున్నాడు.
షాపూర్జీ పల్లోంజీ వద్ద రూ.1.20 కోట్లు డిమాండ్
అహ్మదాబాద్‌కు చెందిన హేమంత్‌కుమార్, రాజేంద్రకుమార్ అనే పారిశ్రామికవేత్తల వద్ద మధ్యవర్తుల ద్వారా రూ.15 లక్షలు వసూలు చేశాడు. ఈ డబ్బును కూడా లండ వరహాలు అకౌంట్‌ద్వారా నట వీరనాగ శ్రీరామ్ హవాలా రూపంలో తరలించాడు. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ట్యాక్సేషన్ అప్పీల్‌ను అనుకూలంగా ఇచ్చేందుకు జీవన్‌లాల్ రూ.1.20 కోట్లు డిమాండ్ చేశాడు. వడోదరలో రూ.15 లక్షలు తీసుకున్నాడు.
శుక్రవారం ముంబైలో మధ్యవర్తి ద్వారా రూ.70 లక్షలు లంచం డబ్బులు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న ఢిల్లీ సీబీఐ అధికారులు మధ్యవర్తిని అదుపులోకి తీసుకున్నారు. జీవన్‌లాల్ తోపాటు శ్రీరామ్ పలిశెట్టి, నట్టవీర నాగ శ్రీరామ్‌గోపాల్, షాపూర్‌జీ పల్లోంజికి చెందిన ట్యాక్సేషన్ డీజీఎం విరల్ కాంతిలాల్ మెహ్రా, సాజిద మజ్హర్
హుస్సేన్‌షాను అరెస్టు చేశారు.