నకిలీ సీబీఐ అధికారి కేసు : గంగుల, గాయత్రి రవిని 8 గంటలు ప్రశ్నించిన సీబీఐ

నకిలీ సీబీఐ అధికారి కేసు : గంగుల, గాయత్రి రవిని 8 గంటలు ప్రశ్నించిన సీబీఐ

నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్​ కేసులో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్​, రాజ్యసభ ఎంపీ గాయత్రి రవిలను న్యూఢిల్లీలో సీబీఐ ఇవాళ 8 గంటల పాటు ప్రశ్నించింది. ఉదయం 11 గంటలకు మొదలైన విచారణ రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. కేసులో సాక్షులుగా విచారణకు హాజరైన ఈ  ఇద్దరిని వేర్వేరుగా సీబీఐ ప్రశ్నించింది. విచారణ ముగిసిన అనంతరం మంత్రి గంగుల మీడియాతో మాట్లాడారు.

‘‘మాకు సీఆర్పీసీ 160 ప్రకారం నిన్న (బుధవారం) నోటీసులు ఇచ్చారు. మాకు చట్టాలపై గౌరవం ఉంది. అందుకే వెంటనే ఢిల్లీకి వచ్చి విచారణకు సహకరించాం. నకిలీ సీబీఐ అధికారి  శ్రీనివాస్ ఫోన్ కాంటాక్ట్ లో మా నెంబర్ , ఫొటోలు ఉన్నందువల్ల విచారణకు పిలిచామని సీబీఐ అధికారులు చెప్పారు. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాసరావును మున్నూరుకాపు సమావేశంలో నేను అనుకోకుండా కలిశాను. మొత్తం రెండుసార్లు అతడిని కలిశాను. శ్రీనివాసరావును మున్నూరు కాపు బిడ్డగా .. ఐపీఎస్ ఆఫీసర్ గా గుర్తించాం తప్ప.. అతడితో ఎలాంటి లావాదేవీలు జరపలేదు. మేము అతడికి ఎక్కడా గిఫ్టులు గానీ.. గోల్డ్ గానీ ఇవ్వలేదు.

నా స్టేట్మెంట్ ను సీబీఐ అధికారులు​ రికార్డు చేసుకున్నరు. 161 స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. దర్యాప్తులో సేకరించిన సమాచారాన్ని మా ముందు పెట్టారు. సీసీ కెమెరాల్లో ఎవరెవరు ఉన్నరు ? ఏమేం మాట్లాడారు అనేది అడిగారు. మేం ఉన్నది ఉన్నట్లు చెప్పాం. మేం చెప్పిన సమాధానాలను వాళ్ల దగ్గర సమాచారంతో ట్యాలీ చేసి చేసుకున్నరు. అంతా కరెక్ట్​గా ఉంది. ఒక ఎస్పీ, ఇద్దరు ఇన్​స్పెక్టర్ల పర్యవేక్షణలో మమ్మల్ని ప్రశ్నించారు. నిందితుడు శ్రీనివాసరావును కూడా పిలిపించి మా ముందే విచారించారు. మళ్లీ విచారణకు రావాలని సీబీఐ అధికారులు చెప్పలేదు” అని మంత్రి గంగుల వివరించారు.

‘‘కాపుల వ్యక్తిగా శ్రీనివాస్  మాకు పరిచయం అయ్యాడు. ఫోన్లు కానీ గోల్డ్ కానీ ఆయన కొనుక్కున్నవే. దర్యాప్తు సంస్థలకు మేం సహకరిస్తాం”అని ఎంపీ వద్దిరాజు రవి మీడియాకు తెలిపారు.