జమ్మూ కశ్మీర్‌‌లో భారీ స్కామ్‌.. 2 లక్షల అక్రమ గన్‌ లైసెన్సులు

జమ్మూ కశ్మీర్‌‌లో భారీ స్కామ్‌.. 2 లక్షల అక్రమ గన్‌ లైసెన్సులు

శ్రీనగర్: ప్రాణ హాని ఉన్న ప్రముఖులకు ఆత్మ రక్షణ కోసం ప్రభుత్వం గన్‌ లైసెన్స్‌ ఇస్తుంది. ఎన్నో రకాలుగా క్రాస్‌ చెక్ చేసుకుని గానీ ఒక వ్యక్తికి గన్ అప్పగించరు. కారణం.. ఆ గన్ అరాచక శక్తుల చేతుల్లోకి వెళ్తే ప్రభుత్వమే తుపాకీ ఇచ్చి నేరాలు జరగడానికి సహకరించినట్లవుతుందన్నదే. కానీ జమ్మూ కశ్మీర్‌‌లో కొందరు ఉన్నతాధికారులు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారీ స్థాయిలో గన్‌ లైసెన్స్‌ స్కామ్‌కు పాల్పడ్డారు. నకిలీ పేర్లతో ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని వ్యక్తులకు ఏకంగా రెండు లక్షల గన్ లైసెన్స్‌లు అక్రమంగా ఇచ్చేశారు. దేశంలోనే భారీ గన్‌ లైసెన్స్‌ స్కామ్‌కు పాల్పడ్డారు. ఐఏఎస్ అధికారుల బంధువులు, ఇతరులు దళారులుగా ఈ స్కామ్‌లో కీలక పాత్ర పోషించి భారీగా అవినీతికి పాల్పడ్డారు. 2017లో తొలిసారి రాజస్థాన్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ ఈ స్కామ్‌ను గుర్తించి, కూపీలాగితే దీని లింక్స్‌ జమ్ము కశ్మీర్‌‌లో బయటపడ్డాయి. దీనికి సంబంధించి తాజాగా శనివారం జమ్ము కశ్మీర్, ఢిల్లీ సహా 40 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు రైడ్స్ చేశారు. జమ్ము కశ్మీర్ ఐఏఎస్ అధికారి షాహిద్ ఇక్బాల్ చౌదరి సహా పలువురు ఉన్నతాధికారుల ఇండ్లలో ఈ తనిఖీలు జరిగాయి. జమ్ము కశ్మీర్‌‌లోని శ్రీనగర్, ఉధంపూర్, రాజౌరీ, అనంతనాగ్, బారాముల్లాల్లో ఈ రైడ్స్ చేశారు.  ప్రస్తుతం ఇక్బాల్ జమ్ము కశ్మీర్‌‌ ప్రభుత్వంలో ట్రైబల్ అఫైర్స్ సెక్రటరీగా, యూత్ మిషన్ సీఈవోగా ఉన్నారు. గతంలో ఆయన కతువా, రియాసి, రాజౌరి, ఉధంపూర్ జిల్లాల్లో డిప్యూటీ కమిషనర్‌‌గా పని చేసిన సమయంలో ఆయన వేల సంఖ్యలో ఫేక్ గన్ లైసైన్స్‌లు జారీ చేసినట్లు సీబీఐ ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. ఇక్బాల్‌తో పాటు ఇలా గతంలో డిప్యూటీ కమిషనర్లుగా పని చేసిన మరో ఎనిమిది మంది అధికారులు ఈ స్కామ్‌లో ఉన్నారని సీబీఐ అధికారులు చెబుతున్నారు. 2012 నుంచి ఏకంగా రెండు లక్షలకు పైగా గన్ లైసెన్సులను అక్రమంగా ఇష్యూ చేసినట్లు తేలింది.

గన్ డీల్స్‌ చేసిన ఐఏఎస్ సోదరుడు

వాస్తవానికి 2017లో రాజస్థాన్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) మొదట ఈ ఫేక్ లైసెన్సుల వ్యవహారాన్ని గుర్తించింది. కశ్మీర్‌‌లోని కుప్వారా జిల్లాలో డిప్యూటీ కమిషనర్‌‌గా పని చేసిన రాజీవ్ రంజన్ అనే ఐఏఎస్ అధికారి సోదరుడిని ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యవర్తిగా గన్‌ డీల్స్ చేసినట్లు గుర్తించారు. అతడితో పాటు మరికొందరు మధ్యవర్తులను కూడా అరెస్ట్ చేశారు. రంజన్ సోదరుడు కస్టమర్లను పట్టుకొస్తే వాళ్ల దగ్గర భారీగా సొమ్ము వసూలు చేసి, ఫేక్ అడ్రస్‌లు క్రియేట్ చేసి ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న వారికి జమ్ము కశ్మీర్‌‌లో అధికారిగా ఉన్న రంజన్ గన్‌ లైసెన్స్‌లు ఇచ్చేవాడని గుర్తించారు.  అయితే గతంలో ఉన్న జమ్ము కశ్మీర్ ప్రభుత్వం ఈ స్కామ్‌ను తొక్కిపెట్టేందుకు ప్రయత్నం చేసింది. విజిలెన్స్ దర్యాప్తు పేరుతో కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసింది. అయితే ఈ స్కామ్‌లో ప్రభుత్వ అధికారులు ఉన్నారని తెలియడంతో, ఆ తర్వాత జమ్ము కశ్మీర్‌‌ గవర్నర్‌‌గా ఉన్న ఎన్‌ఎన్ వోహ్రా తన టైమ్‌లో సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించారు. దీంతో కేసు దర్యాప్తు వేగవంతం అయింది. గత ఏడాది ఫిబ్రవరిలో గన్ స్కామ్‌ ఆర్థిక లావాదేవీలను బయటకు లాగిన సీబీఐ అధికారులు.. పలువురు నిందితులను అరెస్ట్  చేశారు. అందులో కొందరు మాజీ ఐఏఎస్ అధికారుల కూడా ఉన్నారు.