కోల్‌కతా: ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ ట్రెయినీ డాక్టర్‍పై గ్యాంగ్ రేప్ జరగలేదని సీబీఐ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తున్నది. సంజయ్ రాయ్ ఒక్కడే ఆమెపై అత్యాచారం చేసి చంపేసినట్లు విచారణలో తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కేసు దర్యాప్తు కూడా చివరి దశలో ఉన్నదని, ఈ నెల 17న కలకత్తా హైకోర్టులో సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేస్తుందని వివరించాయి. ట్రెయినీ డాక్టర్‍పై గ్యాంగ్ రేప్ జరిగినట్లు వచ్చిన వార్తలను కూడా సీబీఐ తోసిపుచ్చినట్లు తెలిసింది. త్వరగా విచారించి నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నట్లు సీబీఐ అధికారి ఒకరు చెప్పారు.
ఎయిమ్స్ డాక్టర్ల వద్ద నిందితుడి డీఎన్ఏ రిపోర్టు
నిందితుడు సంజయ్ రాయ్కు సంబంధించిన డీఎన్ఏ రిపోర్టును సీబీఐ అధికారులు ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్కు పంపించినట్లు తెలిసింది. డాక్టర్ల బృందం.. డీఎన్ఏ రిపోర్టును పరిశీలిస్తున్నది. ఎయిమ్స్ మెడికల్ టీమ్ తో సీబీఐ అధికారులు భేటీ అవుతారని సమాచారం. వాళ్ల అభిప్రాయం తీసుకున్న తర్వాత విచారణ ముగించాలనే ఆలోచనలో సీబీఐ ఉన్నట్లు తెలుస్తున్నది. సీబీఐ ఇప్పటివరకు వంద స్టేట్మెంట్లను రికార్డు చేసింది. 10 పాలీగ్రాఫ్ టెస్టులు కండక్ట్ చేసింది. ఇందులో రెండుసార్లు మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు టెస్ట్ నిర్వహించారు. ట్రెయినీ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటనలో ఇతరుల ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదు.
దీంతో గ్యాంగ్ రేప్ జరగలేదని సీబీఐ భావిస్తున్నట్లు సమాచారం. రేప్, మర్డర్ కేసులో వాలంటీర్ సందీప్ రాయ్, సెక్యూరిటీ గార్డ్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. హాస్పిటల్లో జరిగిన ఆర్థికపరమైన అవకతవకల నేపథ్యంలో ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను దర్యాప్తు ఏజెన్సీ అరెస్ట్ చేసింది. సందీప్ ఘోష్ సన్నిహితుల ఇంట్లో ఈడీ సోదాలుఆర్జీ కర్ మెడికల్ కాలేజ్మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ఇంటిపై శుక్రవారం ఈడీ అధికారులు దాడులు చేశారు. ఆయన బంధువులు, సన్నిహితుల ఇంట్లో ఏకకాలంలో 9 చోట్ల సోదాలు చేశారు. ఉదయం ప్రారంభమైన సోదాలు.. సాయంత్రం వరకు కొనసాగాయి.
డాక్టర్ కావడం.. ఆమె కల: ట్రైయినీ డాక్టర్ తల్లి
ట్రైయినీ డాక్టర్ తల్లి.. తన కూతురి కోసం టీచర్స్ డే సందర్భంగా రాసిన ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ‘‘డాక్టర్ కావడం నా కూతురు చిన్ననాటి కల. డబ్బు కోసం కాకుండా వీలైనంత ఎక్కువమంది కి మెరుగైన వైద్యం అందించాలనేది ఆమె కోరిక. నా బిడ్డ తరఫున టీచర్లందరికీ సెల్యూట్ చేస్తున్నాను. డాక్టర్ కావాలన్న స్ఫూర్తిని నింపింది మీరే. మీలాంటి గొప్ప టీచర్లు ఆమెకు విద్యాబుద్ధులు నేర్పడంతోనే తన కల నెరవేర్చుకోగలిగింది. డబ్బు వద్దనేది.. తన పేరు పక్కన చాలా డిగ్రీలుండాలని కోరుకునేది. నా బిడ్డను రేప్ చేసి చంపేసిన రోజు కూడా ఎంతోమంది రోగులకు సాయం చేసింది. డ్యూటీలో ఉన్నప్పుడే నా బిడ్డను చంపేశారు. ఆమె కలలను చిదిమేశారు. నా బిడ్డకు న్యాయం కావాలి’’ అని లేఖలో పేర్కొంది.