ఐబొమ్మ రవి కేసులో.. కీలక లీడ్లు!..మరోసారి విచారించిన సీసీఎస్

ఐబొమ్మ రవి కేసులో.. కీలక లీడ్లు!..మరోసారి విచారించిన సీసీఎస్

బషీర్​బాగ్, వెలుగు: ఐబొమ్మ రవిని నాంపల్లి కోర్టు అనుమతితో సీసీఎస్ పోలీసులు మళ్లీ మూడ్రోజుల కస్టడీకి తీసుకున్నారు. నకిలీ స్ట్రీమింగ్ వెబ్​సైట్లు, పైరసీ కార్యకలాపాలకు సంబంధించి నమోదైన కేసుల్లో నిందితుడిగా ఉన్న రవి విచారణ కొనసాగించడానికి కోర్టు అనుమతి ఇవ్వడంతో.. సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం ఉదయం చంచల్​గూడ జైలు నుంచి అతన్ని బషీర్​బాగ్​లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్​కు తరలించారు. ఇప్పటికే రవిపై ఐదు కేసులు నమోదు చేయగా, తొలి కేసులో ఐదు రోజుల కస్టడీ విచారణ కూడా పూర్తి చేసిన విషయం తెలిసిందే. రెండో కేసు దర్యాప్తులో భాగంగా మరో మూడు రోజుల కస్టడీ అవసరమని పోలీసులు విన్నవించగా, కోర్టు ఆమోదించింది. 

5 గంటలపాటు విచారణ

గురువారం జరిగిన మొదటి రోజు విచారణ దాదాపు ఐదు గంటలు కొనసాగింది. ఉదయం 10.30 గంటలకు రవిని సీసీఎస్‌కు తీసుకువచ్చిన పోలీసులు.. అతని నెట్‌వర్క్, ఆర్థిక లావాదేవీలు, ఐపీలను మాస్క్ చేసి నడిపిన అనధికార వెబ్​సైట్లు, పైరసీ వీడియోలను అప్​లోడ్ చేసే ముఠాల కార్యకలాపాలపై ప్రశ్నించారు. పలుమార్లు ఐపీ అడ్రెస్ దాచడానికి ఉపయోగించిన టెక్నిక్​లు, విదేశీ సర్వర్ల వినియోగం, ‘యాడ్ బుల్’ యాప్ నిర్వహణకు గల కారణాలు వంటి అంశాలపై లోతుగా విచారణ చేసినట్లు సమాచారం. ఈ విచారణలో దర్యాప్తు బృందానికి కొన్ని కీలక లీడ్లు లభించాయని, మిగిలిన రెండు రోజుల విచారణలో మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని సైబర్ క్రైమ్ అధికారులు భావిస్తున్నారు.

రవిని త్వరలో బయటకు తీసుకొస్తా

ఇమ్మడి రవిని త్వరలో నిర్దోషిగా బయటకు తీసుకొస్తానని ఏపీ హైకోర్టు న్యాయవాది పెటేటి రాజారావు తెలిపారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో గురువారం ఆయన మాట్లాడారు. న్యాయస్థానంలో ఇమ్మడి రవి కేసు విషయంలో చట్టపరంగా బలమైన వాదనలు వినిపించి , త్వరలోనే జైలు నుంచి బెయిల్ పై విడుదల చేయిస్తానన్నారు. పోలీసులు పెట్టిన సెక్షన్లు బెయిలబుల్ సెక్షన్స్ అని తెలిపారు. త్వరలో రవి తండ్రిని కలిసి ధైర్యం చెప్తానన్నారు. రవి చేసింది తప్పేనని , కానీ తెలుగు ప్రజల మద్దతు అతనికి ఉందన్నారు.