సీఎస్​, డీజీపీకి  ఈసీ వార్నింగ్​!.. మీ పైనా కంప్లయింట్స్​ వచ్చినయ్

సీఎస్​, డీజీపీకి  ఈసీ వార్నింగ్​!..  మీ పైనా కంప్లయింట్స్​ వచ్చినయ్
  • ఎన్నికల షెడ్యూల్​ తర్వాత ఇట్లనే ఉంటే నడ్వదని ఫైర్​

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఆఫీసర్లను నమ్మే పరిస్థితి లేదని రాజకీయ పార్టీలు కంప్లయింట్స్​ చేశాయని, అధికారుల తీరు మారకపోతే ఉపేక్షించేది లేదని సీఎస్​ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్​కు కేంద్ర ఎన్నికల సంఘం తేల్చిచెప్పినట్లు తెలిసింది. ఒకటి, రెండు పార్టీలు మినహా దాదాపు అన్ని పార్టీల నుంచి ఇదే తరహా ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నట్లు సమాచారం. మీడియా సమావేశంలోనూ ఈసీ టీమ్​.. నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఒకరికి అనుకూలంగా.. ఇంకొకరికి వ్యతిరేకంగా పనిచేయడం లాంటివి ఎన్నికల్లో కుదరవని హెచ్చరించింది.

రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధత, నిర్వహణపై మూడు రోజులు పర్యటించిన ఈసీ టీమ్​.. గురువారం చివరి రోజున సీఎస్​, డీజీపీతో గంటపాటు ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా సీఎస్​ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్​పై వచ్చిన కంప్లయింట్స్​ను సీఈసీ ప్రస్తావించినట్లు తెలిసింది. ‘‘రాష్ట్రానికి ఒకరు పరిపాలన, ఇంకొకరు పోలీసు శాఖకు హెడ్​ బాస్​లైన మీపైనా ఎన్నికల షెడ్యూల్​ రాకముందే ఇట్ల కంప్లయింట్స్​ వచ్చాయి.  షెడ్యూల్​ తర్వాత ఇలాంటివి వస్తే ఉపేక్షించబోం” అని ఈసీ టీమ్​ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ‘‘ఏపీ క్యాడర్​కు చెందిన అంజనీకుమార్​పై హైకోర్టులో కేసు నడుస్తున్నది. ఒకవేళ ఎన్నికల మధ్యలోనే ఆర్డర్  వచ్చి ఏపీకి ఆయన బదిలీ అయితే ఎన్నికల ప్రక్రియకు తాత్కాలికంగా ఇబ్బంది కలుగుతుంది కదా” అని కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. ఇతర ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లపైన ఫిర్యాదులు ఉన్నాయని ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని, అధికారులు ఎవరూ పరిధి దాటొద్దని ఈసీ టీమ్​ హెచ్చరించినట్లు సమాచారం.