బీజేపీ ఆఫీసులో సంబురాలు

బీజేపీ ఆఫీసులో సంబురాలు

హైదరాబాద్, వెలుగు:  మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించడంతో రాష్ట్ర బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. పార్టీ స్టేట్ ఆఫీసులో  పీవీ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆఫీసు ముందు పటాకులు కాల్చి, డప్పు చప్పుళ్లతో సంబరాలు చేసుకున్నారు. ఈ ప్రోగ్రామ్ లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్ రెడ్డి, పీవీ మనవడు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాశ్, సంగప్ప తదితరులు  పాల్గొన్నారు.

కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..రాజకీయాలకు అతీతంగా దేశంలో ఉన్న మాణిక్యాలను  కేంద్రం వెలికి తీసి గౌరవిస్తున్నదని ప్రశంసించారు. అందులో భాగంగానే తెలుగు జాతి ముద్దు బిడ్డ పీవీకి భారత్న రత్న ప్రకటించారని చెప్పారు. ఇది తెలుగు ప్రజలకు గర్వకారణమన్నారు. పీవీని కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించారు. మోదీ కులం, పుట్టుక గురించి మాట్లాడే స్థాయి రాహుల్ కు లేదని వెంకటేశ్వర్లు ఫైర్ అయ్యారు. 

దత్తాత్రేయ, అరుణ హర్షం

మాజీ ప్రధాని పీవీకి భారత రత్న ప్రకటించడం పట్ల హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వేర్వేరు ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో పీవీ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఇది తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవమన్నారు. మాజీ ప్రధానులు పీవీ, చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు భారత రత్న ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు.