మైనార్టీలపై దాడుల్నిఆపండి..మోడీకి సెలబ్రిటీల లేఖ

మైనార్టీలపై దాడుల్నిఆపండి..మోడీకి సెలబ్రిటీల లేఖ

న్యూఢిల్లీ: ముస్లింలు, దళితులు, ఇతర మైనార్టీలపై దండుదాడులు పెరిగిపోయానని, వాటిని నివారించేలా చర్యలు తీసుకోండంటూ భిన్న రంగాలకు చెందిన 49 మంది సెలబ్రిటీలు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. అసమ్మతి లేకుండా ప్రజాస్వామ్యం నిలబడదని, ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించేవాళ్లపై యాంటీ నేషనల్​, అర్బన్​ మావోయిస్టు అనే ముద్రలు వేయడం తగదని సూచించారు. దేశంలో దేవుడి పేరుతో దాడులు పెరిగాయని, ‘జై శ్రీరాం’ అనే మాట ఇప్పుడు హింసను రెచ్చగొట్టే నినాదంగా మారిందని లేఖలో సెలబ్రిటీలు పేర్కొన్నారు. నేషనల్​ క్రైమ్ రికార్డ్స్​ బ్యూరో ప్రకారం 2016లో దళితులపై దండుదాడులకు సంబంధించి 840 కేసులు నమోదుకాగా, మెజార్టీ కేసుల్లో ఆధారాలు లేకపోవడంతో నిందితులు తప్పించుకున్నారన్నారు. ఈ తరహా దాడుల్ని ప్రధాని మోడీ గతంలోనే ఖండించినప్పటికీ, వాటిని నివారించే దిశగా చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. పీఎంకు లేఖ రాసిన ప్రముఖుల్లో శ్యాం బెనగల్​, అపర్ణా సేన్​, రామచంద్ర గుహ, సౌమిత్రో ఛటర్జీ, నటి రేవతి, వినాయక్​ సేన్, ఆశిష్​ నందీ తదితరులున్నారు.