గద్దర్ మృతిపై ప్రముఖుల నివాళి

గద్దర్ మృతిపై ప్రముఖుల నివాళి

లెజెండరీ కవిని కోల్పోయాం: తమిళిసై
ప్రజా యుద్ధనౌక గద్దర్  మృతిపై గవర్నర్  తమిళిసై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. రాష్ర్టం ఒక లెజెండరీ కవి, యాక్టివిస్టును కోల్పోయిందని, రాష్ర్టంపై గద్దర్  తనదైన ముద్రవేశారని ఓ ప్రకటనలో గవర్నర్  పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్  తన పాటలతో జనాలను ఉర్రూతలూగించారని కొనియాడారు. గద్దర్ కుటుంబ సభ్యులకు గవర్నర్  సానుభూతి తెలిపారు.

ప్రపంచ ఖ్యాతి తెచ్చిన వాగ్గేయకారుడు: కేసీఆర్
తెలంగాణ పాటకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ కోసం తన ఆట, పాటలతో ప్రజల్లో స్వరాష్ట్ర చైతన్యాన్ని రగిలించారని, ప్రజా యుద్ధనౌకగా ఆయన ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తన జీవితాన్ని ప్రజల కోసమే అంకితం చేశారని, గొప్ప ప్రజాకవిని రాష్ట్రం కోల్పోయిందన్నారు.

ఉద్యమానికి కొత్త ఊపు తెచ్చాడు: కిషన్రెడ్డి
ప్రజా యుద్ధనౌకగా అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న గద్దర్ మృతి వార్త తెలిసి దిగ్ర్భాంతికి గురయ్యానని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు. తన మాట, పాటతో తెలంగాణ ఉద్యమానికి కొత్త ఊపును తీసుకొచ్చారని ఓ ప్రకటనలో తెలిపారు. ఓయూ వేదికగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో.. ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా!’ అన్న గద్దర్  పాట ఓ సంచలనమని అన్నారు. 

గద్దర్​ లేని లోటు పూడ్చలేనిది : కేటీఆర్​
ప్రజా గాయకుడు గద్దర్‌‌‌‌కు రాష్ట్ర అసెంబ్లీ, మండలి నివాళులర్పించాయి. ప్రభుత్వం, అసెంబ్లీ తరపున మంత్రి కేటీఆర్.. శాసనసభ, మండలిలో​సంతాప సందేశం చదివారు. రాష్ట్ర ప్రజలందరికీ గద్దర్ ఆప్తులని, తెలంగాణ మలిదశ ఉద్యమంలో తామంతా కలిసి పాల్గొన్నామని అన్నారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదన్నారు. ప్రజల్లో ఉద్యమ కాంక్షను రగిల్చారని గుర్తుచేశారు. జానపదం, జనపదం ఉన్నంత కాలం ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుందన్నారు.

ప్రజలను కదిలించారు: చంద్రబాబు నాయుడు
తన పాటలతో ప్రజా చైతన్యానికి గద్దర్ ఎనలేని కృషి చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ప్రజలను తన గళంతో గద్దర్ కదిలించారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాల్లో, పౌరహక్కుల పోరాటాల్లో ఒక శకం ముగిసిందన్నారు. గద్దర్ కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు.

ఉద్యమాలకు స్ఫూర్తి: కాసాని జ్ఞానేశ్వర్
ప్రజా ఉద్యమాలకు గద్దర్ జీవితం స్ఫూర్తి అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. పేదల హక్కుల సాధనకు చివరి శ్వాస వరకు పోరాడిన గద్దరన్న మృతి తీరని లోటని పేర్కొన్నారు. గద్దర్ కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

పాటలతో సంచలనం: సురవరం సుధాకర్రెడ్డి
గద్దర్‌‌ చనిపోయిన వార్త బాధ కలిగించిందని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్​ రెడ్డి అన్నారు. గద్దర్ తన పాటలతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించారని, ఆయన పేరు తెలియనివారు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఉండరని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మృతి తీరని లోటన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రమేశ్  రాజా, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి కూడా సంతాపం తెలిపారు.

గద్దర్ మృతికి సీపీఎం సంతాపం 
గద్దర్‌‌ మృతిపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంతాపం ప్రకటించారు. సీపీఎం నిర్వహించిన మహాజన పాదయాత్ర సందర్భంగా, టీ మాస్ వేదిక ఆధ్వర్యంలో జరిగిన అనేక సభల్లో ఆయన పాల్గొని మద్దతిచ్చారని గుర్తుచేశారు. అణగారిన వర్గాలకోసం అనేక పాటలు రాయడంతో పాటు తన ఆట, పాట ద్వారా ‘ప్రజా యుద్ధనౌక’గా పేరుపొందారని కొనియాడారు.