- డిమాండ్ తొమ్మిది శాతం పెరిగే చాన్స్
- ఇంధన ధరలతో మాత్రం ఇబ్బందే..
న్యూఢిల్లీ: 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్ లో సిమెంట్ కంపెనీలు మెరుగైన అమ్మకాలను సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు. ప్రభుత్వం రోడ్డు, వంతెనల వంటి మౌలిక సదుపాయాలకు నిధులను పెంచడం వల్ల సిమెంట్ డిమాండ్ 9 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. అమ్మకాలు పెరిగినప్పటికీ కంపెనీల లాభాలపై ఇంధన ధరల భారం పడనుంది. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల వల్ల పెట్రోల్ ధరలతో పాటు ప్యాకేజింగ్ ఖర్చులు కూడా పెరిగాయి.
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనా ప్రకారం కంపెనీల ఆదాయం 10 శాతం పెరగవచ్చు. ఎబిటా 4 శాతం వృద్ధి నమోదు చేసే అవకాశం ఉంది. నికర లాభం ఒక శాతం మేర తగ్గే అవకాశం ఉంది. సిమెంట్ విక్రయాలు 126 మిలియన్ టన్నులకు చేరవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో సిమెంట్ ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల ధరలు పెరగడం వల్ల ఈ కంపెనీల ఎబిటా మార్జిన్లు 1.2 శాతం మేర తగ్గే అవకాశం ఉంది.
పెరిగిన ఖర్చులు.. ధరలకు రెక్కలు
దిగుమతి చేసుకునే బొగ్గు ధరలు 15 నుంచి 20 శాతం వరకు పెరిగాయి. ప్యాకేజింగ్ కోసం వాడే సంచులకు అయ్యే ఖర్చు 35 నుంచి 45 శాతం మేర భారమైంది. కంపెనీల వద్ద 45 రోజులకు సరిపడా నిల్వలు ఉండటం వల్ల నాలుగో క్వార్టర్ లో ప్రభావం తక్కువగా ఉండవచ్చు. అయితే 2027 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్ లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. కరెంటు, ఇంధన ఖర్చులు మొత్తం ఉత్పత్తి వ్యయంలో 30 శాతానికి పైగా ఉండటం గమనార్హం.
ఈసారి అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీ సిమెంట్, జేకే సిమెంట్స్ రెండంకెల వృద్ధిని నమోదు చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంబుజా సిమెంట్స్ 9 శాతం వృద్ధి సాధించవచ్చు. దాల్మియా భారత్, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ లు 5 నుంచి 6 శాతం వృద్ధి నమోదు చేయవచ్చు. బిర్లా కార్పొరేషన్ వృద్ధి 2 నుంచి 4 శాతానికే పరిమితం కావచ్చు. ఖర్చుల భారాన్ని తగ్గించుకోవడానికి కంపెనీలు ఈ నెల నుంచే బస్తాకు రూ.15 నుంచి రూ.30 వరకు ధర పెంచడం మొదలుపెట్టాయి.

