- లీగల్ ఫ్రేమ్ వర్క్ రూపొందించేలా ప్రతిపాదనలు
- ‘డీప్‌ఫేక్ టాస్క్‌ఫోర్స్’ ఏర్పాటుకు ప్రపోజల్
న్యూఢిల్లీ: డీప్‌ఫేక్‌లను నియంత్రించడానికి, తప్పుడు.. మోసపూరిత కంటెంట్ వ్యాప్తి నుంచి ప్రజలను రక్షించేందుకు లీగల్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించేలా లోక్‌సభలో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే ఈ బిల్లును సభకు ఇంట్రడ్యూస్ చేశారు. డీప్‌ఫేక్ కంటెంట్ క్రియేట్ చేయాలంటే సదరు వ్యక్తుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఈ బిల్లు నిర్దేశిస్తుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ షిండే మాట్లాడారు.
ఏఐను చాలా మంది మిస్ యూజ్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డీప్‌ఫేక్ కారణంగా సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు అందరూ తీవ్ర వేధింపులకు గురవుతున్నట్లు వివరించారు. వీటి నియంత్రణ కోసమే ఈ బిల్లు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. చెడు ఉద్దేశంతో ఇలాంటి కంటెంట్‌ను సృష్టించిన వాళ్లకు.. లేదంటే వాటిని ఫార్వర్డ్ చేసినవాళ్లకు శిక్ష పడాలన్నారు. డీప్‌ఫేక్ కారణంగా వ్యక్తిగత గోప్యత, జాతీయ భద్రతకూ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు. డీప్‌ఫేక్ టెక్నాలజీ.. మీడియా మార్ఫింగ్‌కు ఓ ఆయుధంగా మారిందన్నారు.
డీప్‌ఫేక్ టాస్క్ ఫోర్స్ కోసం సపరేట్ ఫండ్స్
డీప్‌ఫేక్‌ల నియంత్రణకు స్పష్టమైన చట్టపరమైన నిబంధన తీసుకురావాలన్నది ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. డీప్‌ఫేక్ టాస్క్ ఫోర్స్ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచిస్తుంది. ఇది అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ సహకారంతో డీప్‌ఫేక్‌ను నియంత్రిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి ఒక ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
‘సోషలిస్ట్’, ‘సెక్యులర్’ పదాలపై..
రాజ్యాంగ పీఠిక నుంచి ‘సోషలిస్ట్’, ‘సెక్యులర్’ అనే పదాలను తొలగించాలని కోరుతూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు భీమ్‌సింగ్.. ‘ది కాన్‌స్టిట్యూషన్ (అమెండ్‌మెంట్)–2025’ ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ పదాలను 1976లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎమర్జెన్సీ టైమ్‌లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్రజాస్వామికంగా చేర్చిందని ఎంపీ భీమ్ సింగ్ ఆరోపించారు. 1949లో ఆమోదించిన రాజ్యాంగంలో ఈ రెండు పదాలు లేవని తెలిపారు. తాజా బిల్లుతో రెండు పదాలను తొలగించి రాజ్యాంగాన్ని దాని మొదటి రూపానికి తీసుకురావాలని కోరారు. ఈ పదాలు గందరగోళం సృష్టిస్తున్నాయని, అందువల్ల వీటిని తొలగించాలని ఎంపీ తెలిపారు.
