- కొత్త కార్యదర్శిగా నరేశ్ పాల్ గంగ్వార్ నియామకం
- నీట్ పేపర్ లీక్‌పై నిరసనలతో కేంద్రం కీలక నిర్ణయం
- పలువురు ఐఏఎస్ ఆఫీసర్లకు ట్రాన్స్ ఫర్లు, పదోన్నతులు
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్, ఢిల్లీలో విద్యార్థుల నిరసన వేళ కేంద్రం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర విద్యా శాఖ సెక్రటరీ వినీత్ జోషీని బదిలీ చేసింది. ఆయనను కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ట్రాన్స్ ఫర్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. వినీత్ జోషీ స్థానంలో నరేశ్ పాల్ గంగ్వార్‌ను అపాయింట్ చేసింది. నరేశ్ పాల్ రాజస్తాన్ కేడర్‌కు చెందిన 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా నియమితులు కావడానికి ముందు.. ఆయన పశుసంవర్ధక, డెయిరీ శాఖ కార్యదర్శిగా సేవలందించారు. తన కెరీర్ ప్రారంభంలో కేంద్ర, రాజస్తాన్ ప్రభుత్వాలలో పలు కీలక పదవులను నిర్వహించారు.
పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. అక్కడ ఆయన గాలి, నీటి కాలుష్య నియంత్రణ అలాగే ప్రమాదకర పదార్థాల నిర్వహణ విభాగాన్ని పర్యవేక్షించారు. రాజస్తాన్ ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా పనిచేశారు. 2010 నుంచి 2014 మధ్య జాతీయ సోలార్ మిషన్ తొలి దశలో విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన నరేశ్ పాల్..రూర్కీ ఐఐటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ ఐఐటీ నుంచి కమ్యూనికేషన్ అండ్ రాల్‌డార్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ, రాజస్తాన్ వర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందారు. నీట్-యూజీ 2026 పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో విద్యా మంత్రిత్వ శాఖపై విమర్శలు వస్తున్న తరుణంలో ఈ నియామకాలు జరిగాయి. అలాగే, పలువురు ఐఏఎస్ ఆఫీసర్లకు
కేంద్రం ట్రాన్స్ ఫర్లు, పదోన్నతులు కల్పించింది.
