ఒమిక్రాన్ పై రాష్ట్రాలకు కేంద్రం లేఖ

V6 Velugu Posted on Nov 28, 2021

న్యూఢిల్లీ: ఒమిక్రాన్ రకం కరోనా వైరస్‌పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రభుత్వం తరపున కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖ రాశారు. ఒమిక్రాన్ రకం వైరస్‌ను గుర్తించిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో కఠినంగా స్క్రీనింగ్ చేయాలని, అలాగే ఇంటెన్సివ్ కంటైన్మెంట్, పటిష్ట నిఘా, వ్యాక్సినేషన్ విస్తృతం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.
కొన్ని రాష్ట్రాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్య తగ్గినట్టు గుర్తించామని, కాబట్టి కోవిడ్-19 పరీక్షలను పెంచాలని ఆదేశించారు. ముఖ్యంగా హాట్‌ స్పాట్లను గుర్తించి నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు. పాజిటివిటీ రేటు 5 శాతం కంటే ఎక్కువున్న ప్రాంతాలపై రాష్ట్రాలు దృష్టి సారించాలన్నారు. అలాగే గతంలోని అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తగినంత వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కేంద్రం అందజేసిన నిధులను సమర్థవంతంగా వైద్య సదుపాయాల కల్పన కోసం వినియోగించాలన్నారు. 
కొత్త రకం మ్యుటేషన్లను గుర్తించే జీనోమ్-సీక్వెన్సింగ్ పరీక్షలను పెంచాలని రాష్ట్రాలకు సూచించారు. దీనికోసం దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్షియం ల్యాబులను వినియోగించుకోవాలన్నారు. తప్పుడు సమాచారంతో భయాందోళనలు, అపోహలు చెలరేగకుండా, వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు సరైన సమాచారం అందించేలా ఎప్పటికప్పుడు ప్రెస్ బ్రీఫింగ్, బులెటిన్లు విడుదల చేయాలని సూచించారు. ఒమిక్రాన్ రకం వైరస్ ప్రస్తుతం బ్రిటన్, జర్మనీ, ఇటలీ, బెల్జియం, ఆస్ట్రియా, బోట్స్‌వానా, ఇజ్రాయిల్, హాంగ్‌కాంగ్ దేశాల్లో బయటపడ్డాయని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వివరించారు. 

Tagged government, center, state governments, Health ministry, corona, Letter, COVID19, new Delhi, alert, Union government, omicron, write

Latest Videos

Subscribe Now

More News