రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి కేంద్రం కృషి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి కేంద్రం కృషి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి మోడీ సర్కార్ కృషి చేస్తున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. యూపీఏ హయాంలో రాష్ట్రంలో 87 కిలోమీటర్ల కొత్త లైన్లు అందుబాటులోకి వస్తే గడిచిన ఎనిమిదేండ్లలో 444 కిలోమీటర్ల కొత్త  రైల్వే లైన్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ మేరకు బుధవారం ప్రకటన రిలీజ్​ చేశారు. దాదాపు రూ.16 వేల కోట్లను రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి కేంద్రం కేటాయించిందని చెప్పారు. ఇందులో రూ.3,847 కోట్ల వ్యయంతో ఎనిమిది రైల్వే ప్రాజెక్టులు అందుబాటులోకి తెచ్చామన్నారు. రూ.12,160 కోట్ల వ్యయంతో 1,201 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న ఐదు ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. 2,407 కిలోమీటర్ల పొడవైన మరో 33 ప్రాజెక్టులు సర్వే దశలో ఉన్నాయని వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్– 2 అభివృద్ధి కోసం ఒప్పందానికి మించి మొత్తం రూ. 553 కోట్లను ఖర్చు చేసినట్లు తెలిపారు. 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అప్​గ్రేడ్​ కోసం రూ.715 కోట్లను మంజూరు చేశామని, త్వరలోనే పనులను ప్రారంభిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించని కారణంగా ఏండ్లుగా ఆలస్యమవుతూ వస్తోన్న వరంగల్ పీరియాడిక్ ఓవర్ హాలిక్ వర్క్ షాపునకు కూడా టెండర్లు పూర్తయ్యాయన్నారు. ఈ ప్రాజెక్టుతో స్థానికంగా మూడు వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. హైదరాబాద్​లోని ప్రధాన రైల్వే స్టేషన్లపై భారం తగ్గించేలా చర్లపల్లి, నాగులపల్లి వద్ద కొత్త టెర్మినళ్లను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా చర్లపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.221 కోట్లను మంజూరు చేసిందన్నారు. దీంతోపాటు సికింద్రాబాద్​లో ఉన్న ఇండియన్ రైల్వే ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ మేనేజ్ మెంట్ సంస్థ అభివృద్ధికి రూ. 85 కోట్లు శాంక్షన్​ చేశామన్నారు.