న్యూఢిల్లీ: ఆన్లైన్లో అక్రమంగా బెట్టింగ్, గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న మరో 242 వెబ్ సైట్ల లింకులను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. గతేడాది అక్టోబర్ నుంచి అమలులోకి వచ్చిన ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ ప్రకారం.. ఇప్పటివరకూ 7,800 అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వెబ్ సైట్లను నిషేధించినట్టు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఆన్ లైన్ యూజర్లు, ప్రధానంగా యువతను ఆర్థిక దోపిడీ నుంచి కాపాడటం కోసం అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్లాట్ ఫామ్స్‌పై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపాయి.
కాగా, ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ఆన్లైన్ గేమింగ్ బిల్లు, 2025’ పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గతేడాది ఆగస్టులో ఆమోదం తెలిపారు. ఈ బిల్లు 2025, అక్టోబర్ 1 నుంచి చట్ట రూపం దాల్చింది. ఆన్లైన్లో ఈ–స్పోర్ట్స్, సోషల్ గేమ్స్‌ను ప్రోత్సహించే ఈ చట్టం.. డబ్బు ఆధారంగా నడిచే గేమ్స్‌ను మాత్రం నిషేధించింది. ఇలాంటి బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం, ఆర్థిక లావాదేవీలు నడపడంపై కూడా బ్యాన్ విధించింది.
డబ్బు ఆధారంగా నడిచే ఆన్లైన్ గేమ్స్ ఆడే యూజర్లపై పెనాల్టీలు వేయకుండా.. వాటిని నిర్వహించే సర్వీస్ ప్రొవైడర్లు, అడ్వర్టైజర్లు, ప్రమోటర్లు, నిధులు సమకూర్చేవారిపైనే కేంద్రం ఈ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటోంది.
