
- ప్రజాభీష్టాన్ని అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- మా ఒత్తిడికి మోదీ ప్రభుత్వం తలొగ్గింది: మంత్రి పొన్నం
- కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నం: మధు యాష్కీ
- దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిన తెలంగాణ: విప్ బీర్ల అయిలయ్య
- రాహుల్ పోరాటం వల్లే: విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్, వెలుగు: కులగణనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రభుత్వ విజయమని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన నిర్వహిస్తామని ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. దేశ చరిత్రలో మొదటిసారిగా కులగణన నిర్వహించిన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కుల గణనతో తెలంగాణలో ఏ కులం వారు ఎంత నిష్పత్తిలో ఉన్నారని తేల్చి చెప్పిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ ఆలోచన మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం నిర్ణయం తీసుకొని పారదర్శకంగా కులగణన సర్వే చేసిందన్నారు. కాంగ్రెస్ నిర్వహించిన కుల గణనను ఇంతకాలం అపహాస్యం చేసిన బీజేపీ ఇప్పుడు ఇదే దారిలోకి రావడం శుభ పరిణామమని.. ప్రజాభీష్టానికి లొంగి కులగణనను చేపట్టాలని నిర్ణయంచిన కేంద్ర ప్రభుత్వం తీరును అభినందించారు.
రాహుల్ డిమాండ్‌కు తలొగ్గిన కేంద్రం: మాజీ ఎంపీ మధు యాష్కీ
కేంద్ర ప్రభుత్వం దేశంలో జనగణనతో పాటు కుల గణన నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ మధు యాష్కీ అన్నారు. బుధవారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్‌కు తలొగ్గి కుల గణన చేసేందుకు మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం సంతోషకరమన్నారు. దేశంలో 90 శాతం ఉన్న పేద వర్గాలకు వనరుల్లో, సంపదలో వాటా దక్కాలన్న రాహుల్ గాంధీ బలమైన డిమాండ్‌తో.. కులగణన చేపట్టి, వారి జనాభాకు తగ్గట్టుగా వాటా పంచాలన్న ఆయన న్యాయమైన డిమాండ్‌కు కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా కుల గణన చేపట్టి, న్యాయపరంగా, రాజ్యాంగబద్ధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు లభించాల్సిన వాటాను అందించాల్సిన అవసరం ఉందన్నారు.
కులగణన పకడ్బందీగా చేయాలి: ఆది శ్రీనివాస్
రాహుల్ గాంధీ చేసిన పోరాటం వల్ల, సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన విధానంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసు కుందని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది రాహుల్, కాంగ్రెస్ సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు. బీసీ బిడ్డ కాకపోయినా సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేయడం అభి నందించదగ్గ విషయమని అన్నారు. కులగణన పకడ్బందీగా చేయాలన్నారు.
వనరులు, సంపద అందరికీ దక్కాలి: విప్ బీర్ల అయిలయ్య
కేంద్రం కులగణన చేయాలని నిర్ణయం తీసుకోవడంతో దేశంలో తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచిందని విప్ బీర్ల అయిలయ్య బుధవారం ఓ ప్రకటన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు దేశంలో కుల గణన చేయాలని ముందుకు వచ్చిన ప్రధాని మోదీ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. దీన్ని చిత్తశుద్ధితో నిర్వహించి పేదలకు జనాభా శాతం ప్రకారం వనరులు, సంపద దక్కాలని ఆయన కోరారు.
ముమ్మాటికీ తెలంగాణ ప్రభుత్వ విజయం: పొన్నం
జన గణనతో పాటు కుల గణన చేస్తామని కేంద్రం ప్రకటించడం ముమ్మాటికి తెలంగాణ ప్రభుత్వ విజయమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని చట్టం చేసి 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ కేంద్రానికి బిల్లు పంపామని, దీన్ని జాతీయ స్థాయిలో అమలు చేయాలని తాము చేసిన ఒత్తిడి మేరకు ప్రధాని మోదీ తలొగ్గి ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఆలస్యంగానైనా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు ప్రకటించారు.