స్కూల్ కిచెన్ స్టోర్లు కట్టండి.. లేకుంటే ఫండ్స్​ వెనక్కియండి

స్కూల్ కిచెన్ స్టోర్లు కట్టండి.. లేకుంటే ఫండ్స్​ వెనక్కియండి

రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం సీరియస్​

హైదరాబాద్, వెలుగు; తెలంగాణ విద్యాశాఖ నిర్లక్ష్యం మరోసారి బహిర్గతమైంది. రాష్ట్రంలోని స్కూళ్లలో కిచెన్ కమ్ స్టోర్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి ఏండ్లు గడుస్తున్నా, వాటి నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. దీంతో ఈ వ్యవహారంపై కేంద్రం సీరియస్ అయింది. డిసెంబర్ నెలాఖరు వరకూ కిచెన్ కమ్ స్టోర్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించింది. లేకపోతే తాము ఇచ్చిన నిధులను వడ్డీతో సహా చెల్లించాలని స్పష్టం చేసింది. అయితే కేంద్రం నిధులు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయకపోవడంతో ఆ పనులన్నీ ఆగిపోయాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు. 2023–24 ప్రధాన మంత్రి పోషణ్ ప్రోగ్రాం అవ్రూవల్ బోర్డు (పీఏబీ)  సమావేశం ఏప్రిల్ లో జరిగింది. 

దీనికి సంబంధించిన మినిట్స్ తాజాగా బయటకు వచ్చాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2006 నుంచి 2012 వరకూ తెలంగాణ ప్రాంతంలోని 30,408 కిచెన్  కమ్  స్టోర్ల నిర్మాణానికి (నిర్మాణం, మరమ్మత్తులు) కేంద్రం రూ.234.69 కోట్లు ఇచ్చింది. కానీ, 2022 డిసెంబర్ 31నాటికి 17,483 కిచెన్  కమ్  స్టోర్లను మాత్రమే నిర్మించారు. మరో 3,698 స్టోర్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉండగా, 9227 బడుల్లో వాటి నిర్మాణాలే ప్రారంభించలేదు. దీనిపై కేంద్ర విద్యా శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చాలా కాలంగా ఈ సమస్య పెండింగ్ లో ఉందని, వెంటనే పూర్తి స్థాయిలో స్కూల్  లెవెల్  డిటెయిల్స్ ఇవ్వాలని ఆదేశించింది. 2023 డిసెంబర్ నాటికి కిచెన్ కమ్  స్టోర్ల నిర్మాణం పూర్తి చేయాలని సూచించింది. లేకపోతే ఏదైనా మిగిలిన నిర్మాణాలు చేపట్టకపోతే, వాటికి సంబంధించిన మొత్తాన్ని వడ్డీతో సరెండర్  చేయాలని స్పష్టం చేసింది.

న్యూట్రీషన్  గార్డెన్ల డెవలప్ మెంట్​లోనూ నిర్లక్ష్యం

స్కూల్ న్యూట్రిషన్ గార్డెన్ల డెవలప్ మెంట్ లోనూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్షాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తిచూపింది. రాష్ట్రంలో 2021– 22 లో 12,301 స్కూళ్లలో గార్డెన్లు ఉండగా, 2022–23లో   ఆ సంఖ్య 1449 కి పడిపోయింది. రాష్ట్రంలో 27,303 స్కూళ్లలో 1449 బడుల్లోనే వాటిని డెవలప్ చేయడంపై కేంద్రం విస్మయం వ్యక్తం చేసింది. భద్రాద్రి, హైదరాబాద్, జయశంకర్  భూపాలపల్లి, ఖమ్మం, మహబూబ్ నగర్, ములుగు, నల్గొండ, నారాయణపేట, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్క దాంట్లోనూ న్యూట్రిషన్  గార్డెన్లు లేవు. 2022 నవంబర్ లో  కేంద్ర బృందం భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లోని పలు స్కూళ్లను సందర్శించింది. 

ఆయా జిల్లాల్లో ఈ సమస్య ఉందని రాష్ట్ర సర్కారుకు తెలిపింది. అయినా రాష్ట్ర సర్కారులో చలనం రాలేదు. ఇక కిచెన్ పరికరాల కొనుగోళ్లలో ఆలస్యంపైనా కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. 17,414 కిచెన్  పరికరాల కొనుగోళ్లకు 23.76 కోట్లతో 2019–-20లో  పీఏబీ ఆమోదం తెలిపింది. దీంట్లో 14.25 కేంద్రం వాటా. ఈ మొత్తాన్ని 2020 మార్చి4న రిలీజ్ చేసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ పరికరాలు కొనుగోలు చేయలేదు. 2023 ఆగస్టు 31లోగా వంట సామాన్లు కొనుగోలు చేయాలని, వాటి వివరాలను పంపించాలని కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది.