న్యూఢిల్లీ: ప్లాస్టిక్ (పాలిమర్) నోట్లను తెచ్చేందుకు ఇండియా సిద్ధమవుతోంది. దశాబ్దాల ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పనులు పట్టాలెక్కాయి. 2012లోనే పైలెట్ ప్రాజెక్టుగా ప్లాస్టిక్ నోట్లను తీసుకురావాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. కానీ, ఇప్పడు అనుమతి లభించింది. పది రూపాయలు, ఇరవై రూపాయల నోట్లను ప్లాస్టిక్ రూపంలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం తాజాగా ఓకే చెప్పింది.
దీంతో ఆర్‌బీఐ టెండర్ ప్రక్రియను మొదలు పెట్టనుంది. అయితే, మార్కెట్లో ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితం కరెన్సీ స్థానంలో పూర్తిగా ప్లాస్టిక్ నోట్లను భర్తీ చేసే ఆలోచన ఏదీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ సిఫార్సుల మేరకు రూ. 10, రూ. 20 విలువైన పాలిమర్ నోట్లను తలా 100 కోట్ల (ఒక బిలియన్) చొప్పున మొత్తం 200 కోట్ల నోట్లను ప్రయోగాత్మకంగా మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ ఫీల్డ్ ట్రయల్స్ విజయవంతమైతే క్రమంగా వీటిని మార్కెట్లోకి పూర్తిస్థాయిలో విడుదల చేస్తామని చెప్పారు. సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే ప్లాస్టిక్ నోట్లు ఎక్కువ కాలం మన్నుతాయని నిపుణులు చెబుతున్నారు. ---
ఏంటీ ప్లాస్టిక్ నోట్లు..?
మనం సాధారణంగా వాడే భారతీయ కరెన్సీ నోట్లను కాటన్ కాంబర్, లింటర్ (పత్తి పీచు)తో చేసిన కాగితంతో తయారు చేస్తారు. దీంతో చెట్లను నరికే ప్రమాదం ఉండదు. ప్లాస్టిక్ నోట్లను 'నాన్-ఫైబరస్, నాన్-పోరస్' పదార్ధాలతో ముద్రిస్తారు. దీంతో ఇవి నీటిలో తడిచినా ఏం కావు. తక్కువ ముఖవిలువ కలిగిన నోట్లు (రూ.10, రూ.20) చేతులు మారుతుంటాయి.
ఫలితంగా కాగితం నోట్లు త్వరగా చిరిగిపోవడం, పాడవ్వడం జరుగుతుంది. అందుకే వీటికి ఆర్‌బీఐ ప్రాధాన్యం ఇస్తోంది. అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లను ఈ నోట్లలో పొందుపరచడం సులభం కాబట్టి నకిలీ నోట్ల చెలామణిని అరికట్టవచ్చు. కాగా, ఆస్ట్రేలియా 1988లోనే ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్ సహా 60కి పైగా దేశాల్లో ప్లాస్టిక్ కరెన్సీ వాడుకలో ఉంది.
