డబుల్ ఇండ్ల పైసల రిలీజ్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్... ఫండ్స్ వస్తే ఇండ్ల నిర్మాణానికి ఉపయోగించే చాన్స్

డబుల్ ఇండ్ల పైసల రిలీజ్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్... ఫండ్స్ వస్తే ఇండ్ల నిర్మాణానికి ఉపయోగించే చాన్స్
  • కేంద్రం నుంచి రావాల్సిన రూ. 564 కోట్ల బకాయిలు 
  • ఇండ్లు పంపిణీ చేయకపోవడంతో బిల్లులు పెండింగ్  
  • ఇటీవల ఢిల్లీ వెళ్లి అధికారులకు హౌసింగ్ ఆఫీసర్ల వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో  నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి బకాయిలు త్వరలో  రిలీజ్  కానున్నాయి. ఇందు కోసం హౌసింగ్ ఆఫీసర్లు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి నిధుల విడుదల కోసం  అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇండ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ, లబ్ధిదారుల వివరాలను కేంద్రానికి సకాలంలో పంపకపోవడం వల్ల పీఎంఏవై (ప్రధాన మంత్రి ఆవాస్ యోజన) వాటా కింద రావాల్సిన నిధులు ఆగిపోయాయి. 

గత రెండేళ్లుగా ఈ ఫండ్స్ రిలీజ్ చేయాలని కేంద్ర అర్బన్ హౌసింగ్ అధికారులను రాష్ట్ర అధికారులు తరచూ కలుస్తున్నారు. ఇటీవల మరోసారి ఢిల్లీకి వెళ్లిన అధికారులు ఫండ్స్ రిలీజ్ చేయాలని కోరారు. ఈ ఇళ్లకు సంబంధించి కేంద్రం నుంచి రూ.564 కోట్లు రావాల్సి ఉందని రాష్ట్ర హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. ఈ బకాయిలను త్వరలో రిలీజ్ చేస్తామని కేంద్ర అధికారులు హామీ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. 

ఇండ్లు కేటాయించనందుకే నిధులకు బ్రేక్ 

బీఆర్ఎస్ హయాంలో గ్రేటర్ లో 1 లక్ష, జిల్లాల్లో 1 లక్ష 72 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో కేవలం1 లక్షా 45 వేల ఇళ్ల పనులు మాత్రమే స్టార్ అయ్యాయి. ఇప్పటివరకు రాష్ర్ట వ్యాప్తంగా 60 వేల ఇళ్లు మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో 30 వేల ఇళ్లు పంపిణీకి రెడీ అవుతున్నాయి. మిగతావి నిర్మాణంలో ఉన్నాయి. కేంద్రం నుంచి పెండింగ్ లో ఉన్న బిల్స్ వస్తే  నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేసి సొంత జాగా, సొంత ఇళ్లు లేని ఎల్2 లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. 

ఇళ్ల నిర్మాణం పూర్తయిన డబుల్ ఇళ్ల దగ్గర, కాలనీల్లో మౌలిక వసతులు అయిన రోడ్డు, నీళ్లు, కరెంట్ తో పాటు మిగతా వసతులను కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించనున్నారు. ఇప్పటికే పటాన్ చెరు సమీపంలోని కొల్లూరులో15 వేల ఇళ్లు ఉన్న కాలనీ దగ్గర ఇటీవల అంబులెన్స్ లు, షాఫులు, బస్సు సౌకర్యం లాంటి వసతులు ఏర్పాటు చేశారు. వీటితోపాటు వేల సంఖ్యలో ఇళ్లు ఉన్న కుత్బుల్లాపూర్, మహేశ్వరం, పోచారం వంటి ఏరియాల్లో సైతం అన్ని వసతులు ఏర్పాటు 
చేస్తోంది. 

వేర్వేరు రూల్స్ తో పెండింగ్ 

పీఎం ఆవాస్ యోజన రూల్స్ ప్రకారం లబ్ధిదారుల పేర్లు, ఇతర వివరాలు అన్నీ కేంద్ర పోర్టల్ లో అప్ లోడ్ చేస్తేనే ఫండ్స్ రిలీజ్ చేస్తారు. గత ప్రభుత్వం అమలు చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల స్కీం రూల్స్ ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. డబుల్ ఇళ్లు పూర్తయిన తరువాతే లబ్ధిదారులను ఎంపిక చేసి ఇంటిని అందిస్తారు. 

అప్పుడే కేంద్రానికి పేర్లు పంపుతారు. అయితే కేంద్రం ఈ రూల్స్ కు ఒప్పుకోకపోవటంతో ఫండ్స్ నిలిచిపోయాయి. ఇళ్లు పూర్తయి లబ్ధిదారుడికి ఇచ్చిన తరువాత పేర్లు అప్ లోడ్ చేయటంతో గత 8 ఏళ్లలో రూ. 1,200 కోట్లు మాత్రమే రాష్ర్ట ప్రభుత్వానికి వచ్చాయి.