రైతులకు నాణ్యమైన ఎరువులు అందించాలన్నమోడీ

రైతులకు నాణ్యమైన ఎరువులు అందించాలన్నమోడీ

న్యూఢిల్లీ: రైతులకు క్వాలిటీ ఫర్టిలైజర్స్​ను అందించడం, అవసరమైనన్ని అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీము తీసుకొచ్చింది. రైతులు విరివిగా వాడే, ఎక్కువ సబ్సిడీ కలిగిన ఎరువులను అమ్మేందుకు ఒకటే బ్రాండ్​ను అందుబాటులోకి తెచ్చింది. సోమవారం ఢిల్లీలో జరిగిన పీఎం కిసాన్​ సమ్మాన్​ సమ్మేళన్ 2022 కార్యక్రమంలో భారత్​ బ్రాండ్​ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంచ్​ చేశారు. వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్ స్కీమ్​లో భాగంగా ప్రధానమంత్రి భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా సబ్సిడీ ఎరువులన్నిటినీ కంపెనీలు ‘భారత్’ అనే బ్రాండ్ కిందే మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. 

ఎరువుల బ్రాండింగ్​లో కీలక సంస్కరణ

క్వాలిటీని నిర్ధారించడానికి సబ్సిడీ ఎరువులను బ్రాండింగ్ చేయడం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక సంస్కరణ అని ప్రధాని అన్నారు. రిటైలర్లు కమీషన్ కోసం కొన్ని బ్రాండ్‌‌లనే ప్రోత్సహిస్తున్నారని, కంపెనీలు తమ ఉత్పత్తులపై ప్రచారాన్ని విస్తృతంగా చేస్తున్నాయని, దీంతో ఎరువుల బ్రాండ్లపై రైతులు అయోమయానికి గురవుతున్నారని, పొలాలకు నాణ్యమైన పోషకాలు అందడం లేదని చెప్పారు. ఈ సమస్యలకు తాజాగా పరిష్కారం దొరికిందన్నారు. ఇకపై ఒకే బ్రాండ్​ పేరుతో నాణ్యమైన యూరియా భారత్ బ్రాండ్ పేరుతో దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఒకే బ్రాండ్​వల్ల తమ తమ ఉత్పత్తులపై ప్రచారం చేసే విషయంలో కంపెనీల మధ్య పోటీ తగ్గుతుందని తెలిపారు.

దిగుమతులపై ఆధారపడటం తగ్గాలి

ఫర్టిలైజర్స్​ కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని, ఈ విషయంలో మన దేశం స్వయం సమృద్ధి సాధించాలని మోడీ ఆకాంక్షించారు. అంతర్జాతీయంగా మారే పరిణామాల వల్ల ఫర్టిలైజర్స్ ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఎంతో భారం పడుతోందని చెప్పారు. మన దేశం యూరియాను ఇతర దేశాల నుంచి కేజీ రూ.75 నుంచి 80 చొప్పున కొంటోందని, దానిని రైతులకు కేజీ రూ. 5 నుంచి 6కు అమ్ముతోందని చెప్పారు. ఈ ప్రభావం ఖజానాపై పడుతోందని, అనేక పనుల అమలుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ ఏడాది ఎరువుల కోసం రూ.2.5 లక్షల కోట్లు ఖర్చవుతున్నాయన్నారు.

మూతపడ్డ ఫ్యాక్టరీలను తెరిపించినం

2014కు ముందు బ్లాక్​ మార్కెటింగ్​ కారణంగా ఎరువుల కోసం రైతులు ఎన్నో ఇబ్బందులు పడేవారని మోడీ చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక బ్లాక్​ మార్కెటింగ్​కు చెక్​ పెట్టి, ఏండ్లకేండ్లుగా మూతపడ్డ ఎరువుల ఫ్యాక్టరీలను తెరిపించామని వివరించారు. దీంతో సరిపడా ఎరువుల సరఫరా జరగుతోందని మోడీ వివరించారు.

పీఎం కిసాన్​ నిధులు రూ. 16 వేల కోట్లు రిలీజ్

పీఎం కిసాన్​ 12వ విడత నిధులను విడుదల చేసినట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. 11 కోట్ల మంది లబ్ధిదారులకు 16వేల కోట్ల రూపాయలు ట్రాన్స్​ఫర్​ చేస్తున్నట్టు వివరించారు. ఇప్పటిదాకా ఈ స్కీం కింద రూ.2.16 లక్షల కోట్లు బదిలీ చేసినట్టు తెలిపారు. ఢిల్లీలోని పుసా క్యాంపస్​లో సోమవారం నిర్వహించిన ‘పీఎం కిసాన్​ సమ్మాన్​ సమ్మేళన్​–2022’లో ప్రధాని మోడీ పాల్గొని మాట్లాడారు. కమీషన్​ ఏజెంట్లు, దళారుల పాత్ర లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. దీపావళి కంటే ముందే రైతులకు డబ్బులు చెల్లించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రబీ సాగు కోసం ఎంతో ఉపయోగపడ్తాయని తెలిపారు.

కిసాన్ సమృద్ధి కేంద్రాల్లో రైతులకు సేవలు

600 పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాల (పీఎం కేఎస్​కే) లను ఇదే కార్యక్రమం లో ప్రధాని మోడీ ప్రారంభించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి న ఉత్పత్తుల కొనుగోలు, ఇతర సేవలు ఈ కేంద్రాల ద్వారా రైతులు ఒకేచోట పొందవచ్చు. దేశంలోని 3.25 లక్షలకు పైగా ఎరువుల రిటైల్ షాపులను పీఎంకేఎస్ కేలుగా మార్చాలని కేంద్రం భావిస్తోంది. సాగుకు సంబంధించిన విత్తనాలు, ఎరువులు, పనిముట్లను వీటి ద్వారా పంపిణీ చేస్తారు. అలాగే మట్టి, విత్తనాల టెస్టింగ్​తో పాటు ప్రభుత్వ పథకాల సమాచారం అందిస్తారు.