సీఎం విజయ్కి Z + సెక్యూరిటీ.. ఇకపై దళపతిని టచ్ చేయాలంటే..

సీఎం విజయ్కి Z + సెక్యూరిటీ.. ఇకపై దళపతిని టచ్ చేయాలంటే..

చెన్నై: కేంద్ర ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్కి జెడ్ ప్లస్ భద్రతను కల్పించింది. సోమవారం ఉదయం నుంచి విజయ్కి.. MP5 రైఫిళ్లతో కూడిన 55 మంది కేంద్ర భద్రతా దళ సిబ్బంది 24 గంటల పాటు భద్రతను అందిస్తున్నారు. 

ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందికి.. 10 మందికి పైగా ఎన్‌ఎస్‌జి కమాండోలను కూడా కేంద్ర ప్రభుత్వం జత చేసింది. ఇలా.. సీఎం విజయ్ రక్షణనే కర్తవ్యంగా జెడ్ ప్లస్ భద్రతా సిబ్బంది ఆయనకు భద్రత కల్పించనున్నారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీలో మొత్తం 55 మంది సిబ్బంది ఉంటారు.

వీళ్లలో 10 నుంచి 12 మంది నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) కమాండోలు (మెషిన్ గన్‌లతో) ఉంటారు. ఎన్ఎస్జీ కమాండోలతో పాటు, CRPF, CISF, ITBP సిబ్బంది కూడా ఉంటారు. 24/7 భద్రత కల్పిస్తారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, పైలట్ వాహనాలు ఈ జెడ్ ప్లస్ సెక్యూరిటీ పరిధిలోకి వస్తాయి. 

ప్రధానమంత్రి, హోంమంత్రి, ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖ నేతలు, తీవ్రవాదులు, నక్సలైట్ల నుంచి ముప్పు పొంచి ఉండే పారిశ్రామికవేత్తలకు కూడా జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించే అవకాశం ఉంది. జెడ్ ప్లస్ కమాండోలు అత్యాధునిక ఆయుధాలతో (MP5 రైఫిల్స్) అనుక్షణం పహారా కాస్తూ ఉంటారు.

►ALSO READ | ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసేశారు.. విజయ్ ప్రభుత్వానికి ఇక మిగిలింది బలపరీక్షే..

తమిళనాడులో అరవై ఏండ్ల తర్వాత తొలిసారిగా డీఎంకే, అన్నా డీఎంకేయేతర సర్కారు కొలువుదీరిన సంగతి తెలిసిందే. రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా తమిళగ వెట్రి కజగం(టీవీకే) అధినేత చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్ ప్రమాణం చేశారు. ఆదివారం చెన్నైలోని జవహర్‌‌‌‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో విజయ్​తో రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణం చేయించారు.

విజయ్ కేబినెట్లో మంత్రులుగా మరో 9 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రమాణం చేశారు. ఇందులో విజయ్ కోర్ టీమ్ సభ్యులుగా పేర్కొనే ఆధవ్ అర్జున, ఎన్.ఆనంద్, ఆర్. నిర్మల్ కుమార్, కె.జి. అరుణ్‌‌‌‌రాజ్, సెంగోట్టాయన్తో పాటు యువ నేతలు డాక్టర్ టీకే ప్రభు, ఎస్. కీర్తన ఉన్నారు. మొత్తంగా విజయ్ కేబినెట్ యువత, అనుభవజ్ఞుల కలయికగా ఏర్పాటైంది.