డాక్టర్ల మరణాలపై కేంద్రం నిర్లక్ష్యం: ఐఎంఎ ఆగ్రహం

డాక్టర్ల మరణాలపై కేంద్రం నిర్లక్ష్యం: ఐఎంఎ ఆగ్రహం

దేశ వ్యాప్తంగా కరోనాతో 382 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (IMA) తెలిపింది. కరోనాతో ఎంత మంది డాక్టర్లు చనిపోయారో తెలపాలంటూ పార్లమెంట్‌లో ఎదురైన ప్రశ్నకు ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ సమాధానం చెప్పక పోవడంతో.. ప్రజల ఆరోగ్యం రాష్ట్రాల బాధ్యత అని సహాయ శాఖ మంత్రి అశ్విని కుమార్‌ చౌబే తెలిపారు. దీనిపై ఆగ్రహంగా ఉన్న ఐఎంఎ…. ఆ వివరాలను ప్రకటించుకోవాల్సి వచ్చింది. ఇప్పటి వరకు కరోనా రోగులకు సేవలందిస్తూ 382 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారని, వీరిలో అత్యంత చిన్న వయస్సు కల్గిన వ్యక్తి 27 ఏళ్లు కాగా, ఎక్కువ వయస్సు కలిగిన వారిలో 85 ఏళ్ల డాక్టర్ వున్నారని తెలిపింది. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఆరోగ్య కార్యకర్తల సహకారాన్ని తీసుకున్న కేంద్రం, దానికి ఎంత మంది వైద్య నిపుణులు బలయ్యారో తెలుపకపోవడం విచారకరమని ఐఎంఎ ఆందోళన వ్యక్తం చేసింది. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన వీరులు (డాక్టర్లు) పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యింది. ఇంత మంది డాక్టర్లు, ఆరోగ్య సంరక్షకులను భారత్‌ తప్ప ఏ దేశమూ కోల్పోలేదని ప్రకటనలో తెలిపింది.

మరిన్ని వార్తలు