మెడికల్​ కాలేజీలకు ఓకే చెప్పిన కేంద్రం… ప్రపోజల్స్ పంపని రాష్ట్రం

మెడికల్​ కాలేజీలకు ఓకే చెప్పిన కేంద్రం… ప్రపోజల్స్ పంపని రాష్ట్రం

మెడికల్​ కాలేజీల కేటాయింపు కోసం  

ప్రపోజల్స్ పంపట్లె

డీపీఆర్‌లు సిద్ధమైనా సర్కారు వద్దే ఫైల్‌ పెండింగ్‌

    మూడో దశలో 89 కాలేజీలకు  17 రాష్ట్రాల ప్రతిపాదనలు

     57 కాలేజీలకు ఓకే చెప్పిన కేంద్రం

మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు డబ్బులిస్తామని కేంద్రం చెబుతున్నా రాష్ట్ర సర్కారు ప్రపోజల్స్ పంపడం లేదు. ఆరు నెలలుగా అన్ని రాష్ట్రాలు పోటీపడి మరీ ప్రపోజల్స్‌ పెట్టుకుని నిధులు తెచ్చుకుంటుంటే మన ప్రభుత్వం మాత్రం.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు అధికారులు ఐదు కాలేజీలకు డీపీఆర్‌లు సిద్ధం చేసినా, ఆ ఫైలు రెండు నెలలుగా పెండింగ్‌లోనే ఉంది. ఇప్పటికే ఏపీ సహా 17 రాష్ట్రాలు 89 కాలేజీల కోసం ప్రపోజల్స్‌ పంపాయి. అందులో 57 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపామని, మరో 32 పెండింగ్‌లో ఉన్నాయని సెంట్రల్‌ హెల్త్‌ మినిస్టర్‌ హర్షవర్ధన్​ఇటీవల లోక్‌సభలో ప్రకటించారు. కాగా, ఇప్పటికే రెండు దశల్లో 82 జిల్లా హాస్పటల్స్‌ను మెడికల్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు పలు రాష్ట్రాలకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. మూడో దశలో మరో 75 కాలేజీలకు అనుమతిస్తామని, ప్రపోజల్స్‌ పంపాలని రాష్ట్రాలను కోరింది. ఇప్పటిదాకా ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్ కాలేజీల్లేని జిల్లాలకే ప్రాధాన్యం ఇస్తామంది. అందుకు తగ్గట్టు డీపీఆర్(డిటెయిల్డ్​ప్రాజెక్ట్​రిపోర్టు)తో ప్రతిపాదనలు పంపించాలని సూచించింది. అయితే, ఇప్పటిదాకా ప్రభుత్వం ప్రతిపాదనలేవీ పంపలేదు. ఓకే అయిన ప్రతిపాదనలకు కేంద్రం 60 శాతం నిధులు ఇస్తుంది.

ఆ ఫైలు సర్కారు వద్దే

కేంద్రం సూచన ప్రకారం రాష్ట్ర వైద్య విద్యాశాఖ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. కరీంనగర్‌, ఖమ్మం సహా మొత్తం ఐదు జిల్లా హాస్పటల్స్‌ను కాలేజీలుగా అప్​గ్రేడ్​ చేసేందుకు డీపీఆర్​‌లు తయారుచేసి, ఆమోదం కోసం సర్కార్​‌కు పంపింది. రెండు నెలలుగా ఆ ఫైలు సర్కార్​వద్దే పెండింగ్​లో ఉందని, సీఎం కేసీఆర్​ ఆమోదించాల్సి ఉందని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మెడికల్​కాలేజీల ఏర్పాటులో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా పోయినేడాది కేంద్ర మంత్రి హర్షవర్ధన్​కు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​విజ్ఞప్తి చేశారు. అందుకు ఆయన ఓకే చెప్పారంటూ మీడియాకు ఈటల చెప్పారు. ఈ లెక్కన సర్కారు ప్రతిపాదనలు పంపితే కనీసం 2 నుంచి 3 కాలేజీలు వచ్చే అవకాశముంది. తొలి రెండు దశల్లో ఉత్తరాది రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇవ్వడవంతో, మూడో దశలో దక్షిణాది రాష్ట్రాలకు ఇంపార్టెన్స్ ఇస్తోంది. తమిళనాడు 13 కాలేజీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపితే, పదకొండింటికి ఆమోదం తెలిపింది. కర్ణాటక నాలుగు కాలేజీలకు ప్రపోజల్స్‌ పంపితే, మూడింటికి ఓకే చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇటీవలే ఏడు కాలేజీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించగా, వాటిని పరిశీలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇందులో మూడు జిల్లాలు నీతిఆయోగ్ ‘ఆస్పిరేషన్​ డిస్ర్టిక్ట్స్​’ లిస్టులో ఉన్నాయి. దీంతో ఏపీ పంపిన ఏడింట్లో కనీసం మూడింటికి ఓకే అయ్యే అవకాశాలున్నాయి. అయితే, ప్రతిపాదనలు పంపించడంలో రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం వల్ల రాష్ట్రం నష్టపోయే పరిస్థితి వస్తుందంటున్నారు.