
విభజన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన అంశాలను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను తేల్చమంటే ఎనిమదేళ్లుగా ఎటు తేల్చడం లేదని మండిపడ్డారు. గోదావరిలో తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం లేదన్న ఆయన.. జాతీయ ప్రాజెక్ట్ ను ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
తెలంగాణకు చెందిన ఏడు మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారని.. ప్రస్తుతం వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హరీష్ రావు అన్నారు. లోయర్ సీలేరు ప్రాజెక్టును ఏపీకి తరలించారని..దాని వల్ల తెలంగాణకు ఏడాదికి వెయ్యి కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు తెలిపారు. హైడల్ పవర్ ప్రాజెక్టులలో లోయర్ సీలేరు అత్యుత్తమమైన ప్రాజెక్ట్ అన్నారు. ఏపీ నుంచి సీఎస్ఎస్ నిధులు ఇప్పించడంలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీల ఊసే లేదని.. మూడేళ్లుగా వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులను ఇవ్వడం లేదని మండిపడ్డారు.
కొత్తవి ఇవ్వకపోగా ఉన్నవాటిని రద్దు చేస్తున్న ఘనత మోడీ ప్రభుత్వానిదేనని హరీష్ రావు విమర్శించారు. ఐటీఐఆర్, నిమ్జ్, గ్లోబల్ ఆయూష్ సెంటర్, బల్క్ డ్రగ్ వంటివి తెలంగాణకు ఇవ్వకుండా మిగితా రాష్ట్రాలకు ఇచ్చారని మండిపడ్డారు. హైదరాబాద్ లో ఆర్భిట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తే.. దానికి సహకరించకపోగా పోటీగా అహ్మదాబాద్లో మరో సెంటర్ పెట్టడం విడ్డూరమన్నారు. తెలంగాణకు ఐఏఎమ్, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ. మెడికల్ కాలేజీలు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. విభజన హామీలపై బీజేపీ ఎంపీల కృషి ఏమిలేదన్నారు. కేంద్రం ఏమి ఇవ్వకున్నా రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపిస్తున్నామని..కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను మార్చామని హరీష్ రావు తెలిపారు.