తెలంగాణ ప్రజలే కేంద్రానికి నిధులు ఇస్తుర్రు

తెలంగాణ ప్రజలే కేంద్రానికి నిధులు ఇస్తుర్రు

కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని.. తెలంగాణ ప్రజలే కేంద్రానికి నిధులు ఇస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి లక్షా 96 వేల కోట్ల నిధులు వస్తే..రాష్ట్రం పన్నుల రూపంలో కేంద్రానికి 3 లక్షల కోట్లకుపైగా కట్టిందన్నారు. అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ.. కేంద్రం నుంచి రాష్ట్రానికి లక్షా 5 వేల కోట్ల బకాయిలు రావాల్సివుందని చెప్పారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం అప్పుల్లో పంజాబ్ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్ లో ఉందన్నారు.  

కేంద్రం అప్పు కోటీ 52లక్షల 17వేల కోట్లుగా ఉందని..అంటే ప్రతి పౌరుడిపై లక్షా 25వేల అప్పు ఉన్నట్లు హరీష్ రావు చెప్పారు. తెలంగాణ అప్పు 3లక్షల 29వేల కోట్లు అన్న మంత్రి..రాష్ట్రంలో ప్రతి పౌరుడిపై 94వేల రూపాయల అప్పు ఉందన్నారు. రాష్ట్రం ఆదాయం రెట్టింపు అయ్యిందని తెలిపారు. కాళేశ్వరానికి ఇంకా లక్ష కోట్లు అవసరమయ్యేదన్న మంత్రి.. ఈ ప్రాజెక్ట్ దర్వినియోగం కాలేదని సద్వినియోగం అయ్యిందని వెల్లడించారు. కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం 8ఏళ్ల పాలన సఫలం, సంక్షేమం, సామరస్యంగా ఉందని.. కేంద్రానికి విఫలం, విషం, విద్వేషంగా ఉందని హరీష్ రావు విమర్శించారు. దేశ ఆర్థిక స్థితి క్షీణిస్తోందని.. దేశం వృద్ధిరేటు 3 శాతం తగ్గిందన్నారు. గతంతో పోలిస్తే డాలర్ విలువ 30 రూపాయలు పెరగిందని.. ధరల పెరుగుదలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. అసలు జీడిపీ పెరుగుతలేదు కానీ.. గ్యాస్ డీజిల్ పెట్రోల్ రేట్లు మాత్రం భారీగా పెరుగుతున్నాయని ఎద్దేవా చేశారు.