ఇంటర్‌తో సెంట్రల్ జాబ్​

ఇంటర్‌తో సెంట్రల్ జాబ్​

కేంద్ర ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖల్లో లోయర్ డివిజన్ క్లర్క్(ఎల్‍డీసీ), జూనియర్ సెక్ర టేరియట్ అసిస్టెంట్ (జేఎస్ఏ) పోస్టల్‍/సార్టింగ్ అసిస్టెంట్‍, డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో) వంటి పోస్టుల భర్తీకి ఏటా నిర్వహించే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (సీహెచ్ఎస్ఎల్) ఎగ్జామినేషన్ నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ విడుదల చేసింది. గ‌తేడాది 4,893 పోస్టు ల‌తో నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సంవత్సరం కూడా అంతే మొత్తంలో పోస్టులు ఉండే అవకాశం ఉందని సమాచారం. టైర్​–1 ఎగ్జామ్​ 2021 ఏప్రిల్​ 12 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు.  టైర్​–2 పరీక్ష టైం టేబుల్​ వెలువడాల్సి ఉంది. 2020 డిసెంబర్​ 15 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఆన్​లైన్​ అప్లికేషన్​ ఫీజు డిసెంబర్​ 17 వరకు చెల్లించవచ్చు.

సీజీఎల్ తర్వాత ఎక్కువ మంది రాసే పరీక్ష సీహెచ్‍ఎస్‍ఎల్​. ఈ పోస్టులకు దేశవ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది పోటీ పడతారు. సిలబస్ కూడా విస్తృతంగా ఉంటుంది. ప్లాన్డ్‌గా ప్రిపేరయితే ఇంటర్‌తోనే కేంద్ర ప్రభుత్వంలో సుస్థిర జాబ్‌లో ఎంటరయ్యే అవకాశం కల్పిస్తోంది సీహెచ్‌ఎస్‌ఎల్. పే లెవెల్–2, 4 కింద వేతనాలు అందిస్తారు. ప్రారంభంలో ఎల్‌డీసీ, జేఎస్ఏ కి అన్ని అలవెన్సులు కలుపుకొని దాదాపు రూ. 30 వేల శాలరీ లభిస్తుంది. పోస్టల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ కి రూ. 35 వేలకు పైగా వేతనాలు అందుతాయి.

సెలెక్షన్ ప్రాసెస్

టైర్–I, II, III అనే మూడు దశల్లో నిర్వహించే పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. మొదటిదశలో దేశ వ్యాప్తంగా మల్టిపుల్ చాయిస్ విధానంలో 200 మార్కులకు ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలుంటాయి. డ్యురేషన్ 60 నిమిషాలు. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 0.50 మార్కు నెగెటివ్ అవుతుంది. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్, హిందీలో ముద్రిస్తారు. టైర్– I లో మెరిట్ సాధించిన వారిని టైర్–II లో నిర్వహించే డిస్ర్కిప్టివ్ టెస్ట్‌కు సెలెక్ట్ చేస్తారు. ఇందులో కూడా ఎంపికైతే చివరిదశలో నిర్వహించే స్కిల్‍టెస్ట్ లేదా కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్టు రాయాల్సి ఉంటుంది. సరైన ప్లాన్​తో ప్రిపేర్​ అయితే విజయం సాధించవచ్చు.

నోటిఫికేషన్

అర్హత: ఎల్‌డీసీ, జేఎస్ఏ, పీఏ/ఎస్ఏ, డీఈవో పోస్టులకు ఏదైనా గ్రూప్‌తో ఇంటర్/తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫీసులో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా ఇంటర్ ఉత్తీర్ణత తప్పనిసరి.

ఫీజు: రూ.100. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్​సర్వీస్‌మెన్/మహిళలకు ఫీజు లేదు.

అప్లికేషన్​ చివరితేది:

15 డిసెంబర్​ 2020

ఫీజు చెల్లింపు: 17 డిసెంబర్​ 2020

పరీక్ష తేది: 2021 ఏప్రిల్​ 12 నుంచి 27

వెబ్‌సైట్: www.ssc.nic.in