ప్రతి ఇంటితో పోస్టల్ శాఖకు ఏదో ఒక విధంగా సంబంధం : కిషన్ రెడ్డి

ప్రతి ఇంటితో పోస్టల్ శాఖకు ఏదో ఒక విధంగా సంబంధం : కిషన్ రెడ్డి

హైదరాబాద్ అబిడ్స్ పోస్టాఫీస్ లో పోస్ట్ కార్డును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రిలీజ్ చేశారు. బౌద్ద వారసత్వంపై పోస్ట్ కార్డును విడుదల చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. పోస్టల్ డిపార్ట్ మెంట్ భారతదేశ ప్రజల జీవితాల్లో ఒక భాగమైందని చెప్పారు. తపాలా శాఖను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బలోపేతం చేశారన్నారు. పోస్టల్ డిపార్ట్ మెంట్ పై ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందని తెలిపారు. 

ప్రతి ఇంటితో పోస్టల్ శాఖకు ఏదో ఒక విధంగా సంబంధం ఉంటుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ‘‘ఈరోజు ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తోంది. దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యం లేకుండా దేశంలో ఏ కార్యక్రమమూ జరగదు. పాలకులు మోటివేషన్ చేసిన విధంగానే ఉద్యోగులు కూడా ఆ మాదిరిగానే పని చేస్తారు. అయితే.. ఉద్యోగులు సరిగా పని చేయరు.. అవినీతి పరులనే తప్పుడు ఆలోచన, ఆరోపణ ప్రజల్లో ఉంది. మోడీ నాయకత్వంలో పారదర్శకతతో పరిపాలన కొనసాగుతోంది. ఈ విధంగానే మేము ప్రజలకు సేవ చేస్తున్నాం. అందుకే ప్రతిపక్షాలు మాపై అవినీతి ఆరోపణలు చేయవు’’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

తెలంగాణలోని 32 జిల్లాలకు జాతీయ రహదారులను అనుసంధానం చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు రూ.26 వేల కోట్లతో వస్తోందని, ఇవన్ని కూడా ప్రభుత్వ ఉద్యోగుల వల్లే వస్తున్నాయన్నారు. పోస్టుఫీసు సేవలను దేశ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.