రైతులకు గుడ్ న్యూస్: తెలంగాణకు మరో లక్షా 17 వేల టన్నుల యూరియా...

రైతులకు గుడ్ న్యూస్: తెలంగాణకు మరో లక్షా 17 వేల టన్నుల యూరియా...
  • రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో స్పందించిన కేంద్రం
  • తాజా కేటాయింపుల్లో రవాణాలో 60 వేల టన్నులు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలతో కేంద్రం ఈ నెలలో 1.17 లక్షల టన్నుల ఇంపోర్టెడ్ యూరియా కేటాయింపును ఆమోదించింది. అదే విధంగా త్వరలో యాసంగి సాగు షురూ అయ్యే పరిస్థితుల నేపథ్యంలో  రైతులకు ఎరువుల కొరత లేకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్రం తాజాగా కేటాయించిన అదనపు యూరియాలో 60 వేల టన్నులు ప్రస్తుతం రవాణాలో ఉండగా.. మరో 50 వేల టన్నులు వచ్చే వారంలో రాష్ట్రానికి చేరనుంది. ఈ నెల 1 నుంచి ఇప్పటి వరకు 1.44 లక్షల  టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా అయింది. 

వచ్చేవారంలో మరో 50 వేల టన్నులు రాష్ట్రానికి 

  • ఈ నెలలో ఇప్పటివరకు 1.44 లక్షల టన్నుల యూరియా సరఫరా

కాకినాడ, విశాఖపట్నం, గంగవరం, మంగుళూరు, జైగడ్, కృష్ణపట్నం నౌకాశ్రయాల ద్వారా ఈ యూరియా సరఫరా జరుగుతోంది. వీటిలో కాకినాడ నుంచి 15,900 టన్నులు, విశాఖపట్నం నుంచి 37,650 టన్నులు, గంగవరం నుంచి 27 వేల టన్నులు, మంగుళూరు నుంచి 8,100 టన్నులు, జైగడ్ నుంచి 16,200 టన్నులు, కృష్ణపట్నం నుంచి 13 వేల టన్నులు సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం 30వేల టన్నుల యూరియా లోడింగ్‌‌లో ఉండగా.. మరో 50వేల టన్నులు వచ్చే వారంలో లోడింగ్ పూర్తవనుంది. 

అదనంగా 30 వేల టన్నులు ట్రాన్సిట్‌‌లో ఉన్నాయి.  రాష్ట్రంలో యూరియా సరఫరాలో కీలకమైన రామగుండం ఎరువుల కర్మాగారం గత 90 రోజులుగా షట్‌‌డౌన్ కారణంగా ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ పరిస్థితిలో రైతులకు అంతరాయం కలిగించకుండా ఉండేందుకు రాష్ట్ర మంత్రి కేంద్ర రసాయనాల మంత్రి, కార్యదర్శిని కలిసి రామగుండం యూనిట్‌‌ను త్వరితగతిన పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది.

ఎరువుల కొరత లేకుండా చర్యలు

రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎరువుల కొరత లేకుండా, సాగుకు అంతరాయం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యూరియా సరఫరా నిరంతరంగా కొనసాగేలా కేంద్రంతో సమన్వయం చేస్తున్నం.

- తుమ్మల నాగేశ్వర్​రావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి