ఒమిక్రాన్ ముప్పు.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్

ఒమిక్రాన్ ముప్పు.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్

న్యూఢిల్లీ: కరోనా కేసులు తగ్గడంతో తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్న తరుణంలో కొవిడ్ కొత్త వేరియంట్ అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగుజూసిన ఒమిక్రాన్ అనే ఈ వేరియంట్ వేగంగా ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ భారత్ కు ఓ వేకప్ కాల్ లాంటిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైంటిస్టు సౌమ్య స్వామినాథన్ హెచ్చరించిన నేపథ్యంలో మోడీ సర్కార్ అలర్ట్ అయ్యింది. కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం సూచించింది. 

దేశంలో ప్రస్తుత కొవిడ్ పరిస్థితిపై ప్రధాని మోడీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఒమిక్రాన్ ముప్పును ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మంత్రులు, అధికారులతో మోడీ చర్చించారు. వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని, కరోనా కేసులను నిరంతరం పరిశీలించాలని రాష్ట్రాలకు రాసిన ఓ లేఖలో కేంద్రం సూచించింది. కొవిడ్ టెస్టుల సంఖ్యను పెంచాలని, ఆరోగ్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొంది. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువగా ఉన్న దేశాలను గుర్తించామని కేంద్ర హెల్త్ సెక్రటరీ రాజేశ్ భూషణ్ అన్నారు. భారత్ కు వస్తున్న అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.