- హడావుడిగా నోటిఫికేషన్
- లోక్ సభలో చర్చలు జరుగుతుండగానే..
- నోటిఫికేషన్ ఇవ్వడంపై అయోమయం
- ఇదేం తీరు అంటూ కాంగ్రెస్ ఫైర్
న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33 శాతం కోటాను కల్పించే మహిళా రిజర్వేషన్ చట్టం, 2023 గురువారం నుంచి అమలులోకి వచ్చిందని కేంద్ర న్యాయ శాఖ ప్రకటించింది. ఒకవైపు లోక్ సభలో మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లుపై వాడివేడి చర్చలు జరుగుతుండగా, మరోవైపు ఈ చట్టం అమలులోకి వచ్చిందని పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఇదే చట్టాన్ని 2029లో అమలు చేసేందుకు వీలుగా పార్లమెంటులో సవరణలపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ చట్టాన్ని హడావుడిగా గురువారం(ఏప్రిల్ 16) నుంచి అమలులోకి తెస్తూ కేంద్రం ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చిందన్నదానిపై గందరగోళం నెలకొంది.
ఈ చట్టాన్ని అమలులోకి తీసుకురావడానికి గల కారణాలను వివరించకుండా, కేంద్ర న్యాయ శాఖ అధికారి ఒకరు కేవలం "సాంకేతిక కారణాలను" మాత్రమే ప్రస్తావించారని ‘పీటీఐ’ వార్తా సంస్థ వెల్లడించింది. ‘‘చట్టం అమలులోకి వచ్చినప్పటికీ, ప్రస్తుత సభలో రిజర్వేషన్లను అమలు చేయడం సాధ్యం కాదని ఆ అధికారి తెలిపారు. తదుపరి జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే మహిళా రిజర్వేషన్లను అమలు చేయవచ్చని ఆ అధికారి పేర్కొన్నారు” అని తెలిపింది.
"రాజ్యాంగ (106వ సవరణ) చట్టం, 2023లోని సెక్షన్ 1, సబ్-సెక్షన్ (2) ద్వారా కల్పించిన అధికారాలను ఉపయోగించుకుని, కేంద్ర ప్రభుత్వం 2026 ఏప్రిల్ 16వ తేదీని సదరు చట్టం నిబంధనలు అమలులోకి వచ్చే తేదీగా నిర్ణయించింది" అని కేంద్రం నోటిఫికేషన్ లో వివరించినట్టు పీటీఐ తెలిపింది. కాగా, 2023 చట్టం ప్రకారం, 2027 జనాభా లెక్కల తర్వాత జరిగే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండటంతో, ఈ రిజర్వేషన్లు 2034 కంటే ముందు అమలులోకి వచ్చే అవకాశం లేదు.
- ఇదేం విడ్డూరం?: కాంగ్రెస్
పార్లమెంట్ 2023లో ఆమోదించిన 'నారీ శక్తి వందన్ అధినియం(మహిళా రిజర్వేషన్ చట్టం)'ను ఇప్పుడు హడావుడిగా నోటిఫై చేయడం "అత్యంత వింతైన చర్య" అని కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. ఈ చట్టం సవరణలపై ప్రస్తుతం చర్చ జరుగుతోందని, లోక్‌సభలో ఓటింగ్ జరగాల్సి ఉండగా కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయడం విడ్డూరంగా ఉందని ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ విమర్శించారు.
కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ స్క్రీన్‌షాట్‌ను ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తూ, "ఇది అత్యంత వింతైన చర్య" అని కామెంట్ చేశారు. "సెప్టెంబర్ 2023లో ఆమోదించిన నారీ శక్తి వందన్ అధినియం ఈరోజు అమలులోకి వచ్చింది. మరోవైపు దీని సవరణలపై చర్చ జరుగుతోంది. రేపు వాటిపై ఓటింగ్ జరగనుంది. ఈ తరుణంలో కేంద్రం చర్య పూర్తిగా అయోమయంగా ఉంది" అని పేర్కొన్నారు.

