- సిరప్‌ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- దగ్గు సిరప్లు దుర్వినియోగం అవుతున్నాయని రూల్స్ చేంజ్
- మత్తు కోసం ఇష్టారీతిన వాడుతున్న యూత్
- నాణ్యత లోపించి.. చిన్నారులు మరణించిన ఘటనలు
- షెడ్యూల్ ‘కె’ నుంచి ‘సిరప్’లు తొలగింపు
- అమల్లోకి కొత్త డ్రగ్స్ రూల్స్
- ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: ఇకపై మెడికల్ షాపుల్లో నేరుగా దగ్గు టానిక్ అమ్మడానికి వీల్లేదు. డాక్టర్ చీటీ చూపితేనే కాఫ్ సిరప్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దగ్గు మందు సహా ఎలాంటి సిరప్లనైనా మెడికల్ షాపుల్లో నేరుగా అమ్మడానికి వీల్లేదని, రిజిస్టర్డ్ డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ ఉంటేనే విక్రయించాలని స్పష్టంచేసింది. ఈ మేరకు దశాబ్దాల కాలంగా అమల్లో ఉన్న ‘డ్రగ్స్ రూల్స్-1945’కు సవరణలు చేస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జలుబు, దగ్గు వస్తే ఉపశమనం కోసం వేసుకోవాల్సిన దగ్గు మందును.. కొందరు యువకులు మత్తు కోసం వాడుతూ చిత్తవుతున్నారు. గతేడాది మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో ‘కోల్డ్ రిఫ్’ అనే కల్తీ దగ్గు మందు తాగి దాదాపు 14 మంది చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పో యారు. రాజస్థాన్‌లోనూ మరో ముగ్గురు చనిపోయారు. ఇలాంటి ఘటనలకు చెక్ పెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
షెడ్యూల్ 'కె' నుంచి ‘సిరప్’ లు ఔట్..
డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం-1940 ప్రకారం షెడ్యూల్ ‘కె’ పరిధిలో ఉన్న ఔషధాలను డాక్టర్ చీటీ లేకుండానే అమ్ముకునేందుకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. గతంలో సిరప్లు ఈ లిస్టులోనే ఉండడం వల్ల ఫార్మసి స్ట్లు డాక్టర్ చీటీ లేకపోయినా నేరుగా జనాలకు అమ్మే వారు. కిరాణ షాపుల్లోనూ ఈ సిరప్లు దొరికేవి. కానీ, తాజా సవరణ ద్వారా షెడ్యూల్ ‘కె’లో ఉన్న 'సిరప్స్' అనే పదాన్ని ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. దీంతో.. ఇకపై సిరప్ లు కూడా ఇతర పవర్ ఫుల్ మందుల తరహాలోనే కఠినమైన నియంత్రణలోకి వచ్చాయి. రిజిస్టర్డ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూపిస్తే తప్ప మెడికల్ షాపుల్లో వీటిని అమ్మడం నేరంగా పరిగణిస్తారు.
నిబంధనలు మీరితే కఠిన చర్యలే..
మందుల తయారీ, నిల్వ, విక్రయాల్లో పారదర్శకత పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా సిరప్ లను విక్రయిస్తే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని, ఫార్మసీ లైసెన్సులు రద్దు చేయడంతో పాటు జైలు శిక్ష కూడా పడుతుందని రాష్ట్రాల డ్రగ్ కంట్రోల్ అధికారులను కేంద్రం ఆదేశించింది. కాగా, ఈ రూల్స్ మార్పు కోసం కేంద్ర ప్రభుత్వం గత ఏడాది కాలంగా కసరత్తు చేసింది. గతేడాది డిసెంబర్ 29న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ను విడుదల చేసి.. ప్రజలు, నిపుణుల కమిటీ సూచనలు పరిగణనలోకి తీసుకుని ఈ తుది నిర్ణయం తీసుకుంది. ఇప్పట్నుంచి సాధారణ దగ్గు, జలుబు మందుల కోసం కూడా జనం కచ్చితంగా డాక్టరును సంప్రదించాల్సిందే!
