గాంధీల ఫ్యామిలీ ఎన్జీవోలకు కేంద్రం ఆదేశం

గాంధీల ఫ్యామిలీ ఎన్జీవోలకు కేంద్రం ఆదేశం

న్యూఢిల్లీ: విదేశాల నుంచి విరాళాలు సేకరించకుండా గాంధీల కుటుంబానికి చెందిన స్వచ్ఛంధ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈమేరకు రాజీవ్ గాంధీ ఫౌండేషన్(ఆర్జీఎఫ్), రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ (ఆర్జీసీటీ)ల ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్(ఎఫ్​సీఆర్ఏ) లైసెన్స్‌‌‌‌ను రద్దు చేసింది. విదేశాల నుంచి వచ్చిన విరాళాలకు సంబంధించి అవకతవకలు జరిగినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆర్జీఎఫ్, ఆర్జీసీటీల్లో అవకతవకలపై విచారణ బాధ్యతలను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. గాంధీ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్జీవోల్లో అవకతవకలపై దర్యాప్తునకుగానూ 2020లో కేంద్రం వివిధ శాఖల అధికారులతో ఓ కమిటీని నియమించింది. ఆదాయపన్ను రిటర్న్‌‌‌‌ల దాఖలులో సరైన పత్రాలు సమర్పించకపోవడం, చైనా సహా విదేశాల నుంచి వచ్చిన నిధుల దుర్వినియోగం, మనీలాండరింగ్ ద్వారా వాటిని వేరే చోటికి తరలించడం వంటి ఆరోపణలను ఈ కమిటీ దర్యాప్తు చేసింది. కమిటీ విచారణలో తేలిన అంశాల ఆధారంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

పార్లమెంట్​ బిల్డింగ్​కు సమీపంలోని జవహర్​ భవన్​నుంచి ఆర్జీఎఫ్, ఆర్జీసీటీలు పనిచేస్తున్నాయి. దేశంలోని పేదలకు సహాయం చేసేందుకుగానూ 2002లో ఆర్జీసీటీని ఏర్పాటు చేశారు. ఇది ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, హర్యానాలో పేదలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సేవలందిస్తోంది. ఆర్జీఎఫ్​ను 1991లో స్థాపించారు. హెల్త్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్, మహిళలు, పిల్లలు, దివ్యాంగులకు అండగా నిలవడం లాంటి సేవల కోసం దీనిని ఏర్పాటుచేశారు. ఇందిరాగాంధీ మెమోరియల్​ ట్రస్ట్​లో కార్యకలాపాలపైనా విచారణ జరుగుతోంది. ఆర్జీఎఫ్​కు సోనియా గాంధీ చైర్​పర్సన్​గా ఉన్నారు.