- ఆరు దశాబ్దాల హింసాకాండ తర్వాత చరిత్రాత్మక మైలురాయి
- 2026, మార్చి 31 నాటికి నక్సలిజం అంతమైనట్టుగా వెల్లడి
- దేశంలో నక్సల్స్ అణచివేతపై కేంద్ర హోం శాఖ నివేదిక విడుద
న్యూఢిల్లీ, వెలుగు: భారత్ ఇక నక్సల్స్ రహిత దేశమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వామపక్ష తీవ్రవాదం (లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం)పై దేశం చేస్తున్న పోరాటంలో ఆరు దశాబ్దాల హింసాకాండ తరువాత చరిత్రాత్మక మైలురాయిని అధిగమించినట్లు పేర్కొంది. నక్సల్స్ రహిత భారత్ లక్ష్య సాధనలో భాగంగా అత్యంత వ్యూహాత్మక అడుగులు వేసినట్టు తెలిపింది. ‘ట్రేస్, టార్గెట్, న్యూట్రలైజ్’ సిద్ధాంతంతో మావోయిస్టుల నెట్‌వర్క్‌ను భద్రతా దళాలు పూర్తిగా నిర్వీర్యం చేశాయని వెల్లడించింది. ఈ మేరకు నక్సలిజం అణచివేతపై కేంద్ర హోం శాఖ శుక్రవారం ఒక నివేదికను విడుదల చేసింది. దశాబ్దాల తిరుగుబాటు సంబంధిత హింస తర్వాత.. 2026, మార్చి 31నాటికి దేశం నక్సలిజం నుంచి వాస్తవంగా విముక్తి పొందినట్టు తెలిపింది. భద్రత, అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పునరావాస చర్యలను మిళితం చేస్తూ గత 12 ఏండ్లుగా నిరంతరంగా చేసిన కృషి ఫలితమే ఈ విజయం అని ప్రభుత్వం పేర్కొంది.
నక్సల్బరీ తిరుగుబాటు నుంచి మొదలై..
నక్సలిజం అంతానికి కేంద్రం అనుసరించిన విధానంలో నిఘా, పర్యవేక్షణ, ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో సాంకేతికత ఆధారిత చర్యలు ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఈ చర్యల వల్ల హింస తగ్గిందని, కార్యకర్తలు లొంగిపోయేలా ప్రోత్సహించారని, అలాగే నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, ప్రజా సేవలకు అవకాశాలు మెరుగుపడ్డాయని పేర్కొంది. ‘‘ఈ ఉద్యమం1967లో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన నక్సల్బరీ తిరుగుబాటు నుంచి ఉద్భవించింది. కాలక్రమేణా, అనేక తీవ్రవాద సమూహాలు వివిధ ప్రాంతాల్లో పని చేస్తూ, 2004లో సీపీఐ (మావోయిస్ట్) జెండా కింద విలీనమయ్యాయి.
అనంతరం ఈ సంస్థ తిరుగుబాటుకు ప్రధాన ముఖంగా ఆవిర్భవించింది. దేశానికి అంతర్గత భద్రతా సవాళ్లలో ఒకటిగా మారింది. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాలలో వామపక్ష తీవ్రవాదం సవాలుగా మారింది. అనేక ప్రాంతాల్లో సుదీర్ఘ హింస నెలకొనడంతో పాటు అభివృద్ధి, ప్రభుత్వ సేవలకు ఆటంకం ఏర్పడింది. చివరకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో 2026 మార్చి 31నాటికి భారత్ నక్సలిజం నుంచి పూర్తిగా విముక్తి పొందింది” అని నివేదికలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ పేర్కొన్నారు.
