తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోంది : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 

తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోంది : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 
  • ధాన్యం దిగుబడి, కొనుగోళ్లలో తెలంగాణ రికార్డు
  • చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని నీటిపారుదల, పౌర సరఫరాలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి చేస్తే కేంద్రం కొనుగోలు కోటా పెంచకుండా కేవలం మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పండించిన చివరి గింజ వరకు కొంటుందని మంత్రి హామీ ఇచ్చారు.  మంగళవారం సెక్రటేరియట్‌‌లో మీడియా చిట్‌‌చాట్‌‌లో మంత్రి మాట్లాడారు.

ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.  కాంగ్రెస్​ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలుస్తోందని తెలిపారు.  కేంద్ర ప్రభుత్వం కేవలం మద్దతు ధర ప్రకటించి బాధ్యత నుంచి తప్పించుకుందని విమర్శించారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరతోనే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.

ఇప్పటివరకు 54 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, రైతుల ఖాతాల్లోకి 48 గంటల్లోనే డబ్బులు జమ చేశామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 52 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం 75 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో బిహార్, పశ్చిమ బెంగాల్‌‌కు చెందిన హమాలీలు తమ రాష్ట్రాలకు వెళ్లిపోవడంతో ఇక్కడ కొంత ఇబ్బంది ఎదురవుతుందన్నారు