పర్యావరణ ప్రభావంపై స్టడీ చేయండి

పర్యావరణ ప్రభావంపై స్టడీ చేయండి
  • నారాయణపేట–కొడంగల్ లిఫ్ట్​పై విధివిధానాలు ఖరారు చేసిన కేంద్రం
  •  నేల, నీరు, గాలి నాణ్యతపై పరీక్షలు చేయాలని సూచన
  •  ఒక్క చెట్టు కొట్టేస్తే ఐదు చెట్లను నాటాలని ఆదేశాలు
  •  పర్యావరణ అనుమతులు వచ్చాకే ప్రాజెక్టు పనులు చేయాలన్న ఎన్జీటీ

హైదరాబాద్, వెలుగు: నారాయణపేట–కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్​కు పర్యావరణ అనుమతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధివిధానాలను ఖరారు చేసింది. వివిధ ప్రాజెక్టులు, ప్రైవేట్ సంస్థలతో పర్యావరణం మీద పడే ప్రభావంపై ఈ నెల 23న కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్​మెంట్ అథారిటీ (ఎస్​ఈఐఏఏ) మీటింగ్​ను హైదరాబాద్​లో నిర్వహించారు. ఆ మీటింగ్​కు సంబంధించి మినిట్స్​ను తాజాగా విడుదల చేశారు. 

ఆ సమావేశంలోనే ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని మక్తల్, నారాయణపేట, కొడంగల్​నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకుపైగా నీళ్లిచ్చేందుకు చేపట్టిన నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ప్రాజెక్టుపైనా చర్చించారు. ఈ నెల 8న ప్రాజెక్టు టీవోఆర్​ను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. అయితే, ఆ ప్రాజెక్టుతో పర్యావరణం మీద పడే ప్రభావాన్ని అంచనా వేసేందుకు పలు ఇన్వెస్టిగేషన్స్ చేయాలని ఎస్ఈఐఏఏ సభ్యులు సమావేశంలో సూచించారు. ప్రీమాన్సూన్, మాన్సూన్, పోస్ట్ మాన్సూన్ సీజన్లలో పలు అంశాలపై స్టడీ చేయాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మించాలనుకుంటున్న ప్రాంతంలో తొమ్మిది లొకేషన్లలో భూగర్భ జలాలు, ఉపరితల జలాలు, మట్టి నమూనాలు సేకరించాలని సూచించారు. అంతేగాకుండా కనీసం ఒక్క సీజన్​లో అక్కడ శబ్ద కాలుష్యం తీరును అంచనా వేయాలన్నారు. ప్రాజెక్ట్​ పరిసరాల్లో వాహనాల రాకపోకలపైనా విశ్లేషణ చేయాలని పేర్కొన్నారు.

అవసరమైతేనే చెట్లు కొట్టాలి

ప్రాజెక్ట్​ నిర్మాణంలో భాగంగా 2,434 చెట్లను కొట్టేస్తున్నట్టు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారని, ఒక్క చెట్టును కొట్టేస్తే దానికి రీప్లేస్​మెంట్​గా ఐదు చెట్లను నాటాలని ఎస్​ఈఐఏఏ సభ్యులు సూచించారు. ప్రాజెక్ట్​ ప్రదేశంలోని ప్రతి చెట్టునూ మార్క్​ చేయాలని, అత్యవసరమైతేనే చెట్లను కొట్టాలని స్పష్టం చేశారు. చెట్లను కొట్టేయాల్సి వస్తే అటవీ అధికారుల పర్యవేక్షణలోనే చేయాలని స్పష్టం చేశారు. ప్రాజెక్ట్​ నిర్మించే ప్రాంతంలో తవ్వకాలు చేపడితే ఆ వ్యర్థాలను చుట్టుపక్కల వారికి ఇబ్బందులు లేకుండా తరలించాలని సూచించారు. 

కాగా, ప్రాజెక్ట్​ను కర్ణాటకకు సరిహద్దుల్లో కడుతున్నందున ఆ రాష్ట్ర ఎన్​వోసీని తీసుకోవలని సూచించగా.. ఇప్పటికే కర్ణాటక ఎన్​వోసీ ఇచ్చిందని మన అధికారులు పేర్కొన్నారు. ఎన్​వోసీని సమర్పించారు. అయితే, ప్రాజెక్టు బీ1 కేటగిరీలో ఉన్నందున వెంటనే పర్యావరణ ప్రభావ అంచనా నివేదికను తయారు చేయాల్సిందిగా ఆదేశించారు. నేల పరిస్థితులు, భౌగోళిక, రసాయనిక పరిస్థితులను విశ్లేషించాల్సిన అవసరం ఉందని సూచించారు. వెయ్యి హెక్టార్లకు ఒక శాంపిల్​ చొప్పున పర్యావరణ విశ్లేషణ చేయాలన్నారు. 

యాంబియెంట్ ఎయిర్ క్వాలిటీ పారామీటర్లను తేల్చాలని పేర్కొన్నారు. కాగా, నారాయణపేట కొడంగల్ లిఫ్ట్​ పనులను పర్యావరణ అనుమతులు వచ్చే వరకు చేపట్టరాదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశించింది. పనులను తాత్కాలికంగా ఆపేయాలని ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ఇంకా భూసేకరణ దశలోనే ఉన్నది.