సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదన్న ప్రధాని

సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదన్న ప్రధాని
  • నన్ను ఎంత తిట్టినా భరిస్త.. ప్రజల జోలికి వస్తే మాత్రం సహించను: ప్రధాని మోడీ
  • రాష్ట్రాన్ని అవినీతి, కుటుంబ పాలన నుంచి రక్షించడమే మా కర్తవ్యం
  • మూఢ నమ్మకాలతో టీఆర్​ఎస్​ చీకటి పాలన.. ప్రజలను వంచిస్తున్నది
  • బీజేపీకి మునుగోడు భరోసా ఇచ్చింది.. ఒక్క సీటు కోసం రాష్ట్ర ప్రభుత్వమే దిగొచ్చింది
  • వెయ్యి మంది కేసీఆర్​లు వచ్చినా మోడీని అడ్డుకోలేరు: కిషన్​రెడ్డి

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణలో ప్రజలను దోచుకునే వాళ్లు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ హెచ్చరించారు. ‘‘కొన్ని దర్యాప్తుల నుంచి తప్పించుకునేందుకు అవినీతిపరులందరూ జట్టు కడుతున్నారు. రాష్ట్రాన్ని అవినీతి, కుటుంబ పాలన నుంచి రక్షించటమే మా కర్తవ్యం. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’’ అని  స్పష్టం చేశారు. తనను, బీజేపీని తిట్టినా పర్వాలేదని, తెలంగాణ ప్రజల జోలికి వస్తే మాత్రం సహించేది లేదని అన్నారు. ఏపీ నుంచి శనివారం మధ్యాహ్నం తెలంగాణకు చేరుకున్న ప్రధానికి.. బేగంపేటలో బీజేపీ రాష్ట్ర శాఖ ఘనంగా స్వాగతం పలికింది. ఎయిర్​పోర్ట్​ ఆవరణలో జరిగిన హైదరాబాద్​ సిటీ బీజేపీ కార్యకర్తలు, పార్టీ నాయకుల సభలో ప్రధాని ప్రసంగించారు. ‘‘తెలంగాణ ప్రజలకు మాటిస్తున్నా.. అవినీతి, కుటుంబ పాలన అంతమవుతుంది” అని అన్నారు. తాము పేదలకు అందాల్సిన నిధుల్లో అవినీతికి తావు లేకుండా చేశామని, సంక్షేమ ఫలాలు  నేరుగా ప్రజలకే ఇస్తుండటంతో అవినీతిపరులకు కడుపుమండుతున్నదని పేర్కొన్నారు. పీఎం కిసాన్‌‌ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తున్నట్లు చెప్పారు. జన్​దన్​, ఆధార్‌‌, మొబైల్‌‌ వంటి సేవలతో అవినీతి లేకుండా సంక్షేమం అందిస్తున్నామని తెలిపారు. ప్రజలకు సేవ చేసే లక్ష్యంతోనే బీజేపీ రాజకీయాలు చేస్తున్నదన్నారు. రాష్ట్ర బీజేపీ కార్యకర్తలను చూసి తాను ఎంతో స్ఫూర్తి పొందానని ప్రధాని అన్నారు.  '‘నేను రోజుకు రెండు, మూడు కిలోలు తిట్లు తింటూనే ఉన్నాను. ఆ తిట్లను ఎప్పుడూ పట్టించుకోలేదు. నాకు అలసట లేదు. ఆ తిట్లే నాకు బలంగా మారుతున్నాయి. మోడీని, బీజేపీని తిట్టటం వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటే అలాగే కానివ్వండి’’ అని ప్రధాని పేర్కొన్నారు.

ఒక్క సీటు కోసం అసెంబ్లీ మొత్తం దిగింది

మునుగోడు బై ఎలక్షన్​లో  ప్రజలు బీజేపీ ఒక భరోసా ఇచ్చారని ప్రధాని మోడీ అన్నారు.  ఒక్క అసెంబ్లీ సీటు కోసం అసెంబ్లీలోని తెలంగాణ సర్కారు మొత్తం మునుగోడుకు పోయిందని, మునుగోడులో కమల వికాసం కనిపించిందని పేర్కొన్నారు. మునుగోడులో బీజేపీ కార్యకర్తల పోరాటం ఎంతో అభినందనీయమని,  తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారేనని ప్రజలు చాటి చెప్పారని ఆయన అన్నారు. ‘‘తెలంగాణలో చీకటి రోజులు ఇక ఉండవు.. ఎప్పుడు చీకటి కమ్ముకుంటుందో.. నాలుగు దిక్కుల నుంచి చిమ్మచీకట్లు ముసురుకుంటాయో అటువంటి సమయంలోనే కమలం వికసిస్తుంది. ప్రజలు కష్టాల్లో ఉన్న దగ్గర బీజేపీ భరోసా ఇస్తుంది. కమల వికాసంతో రాష్ట్రానికి సూర్యోదయం ఖాయం’’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలు ఎన్ని అవాంతరాలు ఎదురైనా, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిక కేసులు పెట్టి వేధించినా ధైర్యంగా పోరాటం చేస్తున్నారని ఆయన అభినందించారు. తాను కూడా బీజేపీలో చిన్న కార్యకర్తేనని, రాష్ట్ర బీజేపీ శ్రేణులు బలమైన శక్తులని, ఎవరికీ భయపడరని అన్నారు. సిటీ బీజేపీ కార్యకర్తలతో మాట్లాడాలని బండి సంజయ్​ చెప్పడంతో తానూ ఓ కార్యకర్తగా వచ్చానని మోడీ తెలిపారు. 1984లో దేశంలో బీజేపీ కేవలం ఇద్దరు ఎంపీలు ఉన్నారని, అందులో తెలంగాణలోని హన్మకొండ నుంచి జంగారెడ్డిని గెలిపించి ఇక్కడి వాళ్లు బీజేపీకి అండగా ఉన్నారని ఆయన గుర్తుచేశారు. తెలంగాణతో బీజేపీకి విడదీయని అనుబంధం ఉందని, అన్ని వేళలా ఇక్కడివారికి అండగా ఉంటామని చెప్పారు. 

మూఢనమ్మకాలతో పాలన చేస్తున్నరు

రాష్ట్రంలో కుటుంబం ఫస్ట్‌‌.. అనే తరహాలో పాలన కొనసాగిస్తున్నారని మోడీ మండిపడ్డారు. అవినీతి, కుటుంబ పాలన ప్రజాస్వామ్యానికి, పేదలకు తొలి శత్రువులు  ఆయన అన్నారు. తన ఫస్ట్​ ప్రయారిటీ, బీజేపీ ఫస్ట్​ ప్రయారిటీ ప్రజలకేనని చెప్పారు. ‘‘తెలంగాణ పేరుపై అధికారంలోకి వచ్చిన పార్టీ.. తాను మాత్రం అభివృద్ధి చెంది ప్రజలను వెనక్కినెట్టింది. మూఢనమ్మకాలను పెంచిపోషిస్తున్నది. ఎక్కడ ఉండాలన్నా.. ఎక్కడికి పోవాలన్నా.. మంత్రివర్గం ఏర్పాటు చేయాలన్నా.. కొత్తగా ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్నా.. తొలగించాలన్నా.. అన్నిటికీ మూఢనమ్మకాల మీదనే ఆధారపడుతున్నరు. ఐటీ రంగానికి హబ్‌‌గా ఉన్న హైదరాబాద్​లో అంధ విశ్వాసాలతో పాలిస్తున్నరు. అంధవిశ్వాసాలు పోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి” అని ఆయన అన్నారు. 

ఎర్రజెండా నేతలు అభివృద్ధికి వ్యతిరేకులు

రాష్ట్రంలో అభివృద్ధి వ్యతిరేకులతో టీఆర్​ఎస్​ సర్కారు జతకట్టిందని ప్రధాని మోడీ దుయ్యబట్టారు. ఎర్రజెండా నేతలు అభివృద్ధి, సామాజిక న్యాయానికి వ్యతిరేకులని, అలాంటి వాళ్లతో టీఆర్​ఎస్​ సర్కారు చేతులు కలిపిందని అన్నారు. తనను, బీజేపీ ఎన్ని తిట్టినా ఫర్వాలేదని చెప్పారు. తిట్లే తనకు శక్తిగా మారుతున్నాయని, ప్రజలకు సేవ చేసుకునేలా చేస్తున్నాయని అన్నారు. ‘‘నన్ను తిట్టినా, బీజేపీని తిట్టినా భరిస్తం. తెలంగాణ ప్రజలను తిడితే మాత్రం సహించను. మోడీని తిట్టేవాళ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సాయంత్రం టీ తాగుతూ ఆ తిట్లను ఎంజాయ్​ చేయాలి. పొద్దున లేచి కమల వికాసం కోసం పనిచేయాలి. 20, 25 ఏండ్లుగా నన్ను రకరకాలుగా తిడుతున్నారు. వాటిని నేను పెద్దగా పట్టించుకోను” అని చెప్పారు. అవినీతిని సహించనందుకే కొందరు ఇలా తిడుతున్నారని అన్నారు. 

ప్రజలను మోసం చేస్తున్నరు

కరోనా సమయంలో పేదల ఆకలి తీర్చేందుకు రూ. 3 లక్షల కోట్లు ఖర్చు చేశామని ప్రధాని మోడీ తెలిపారు.  తెలంగాణలోనూ 2 కోట్ల మందికి రేషన్‌‌ బియ్యం పంపిణీ చేసినట్లు చెప్పారు. అయితే గతంలో పేదలకు ఇచ్చే రేషన్‌‌ బియ్యంలోనూ అక్రమాలు చేశారని, అలాంటి వాటిని అరికట్టేందుకు ఆధార్​ వంటివి తప్పనిసరి చేసినట్లు తెలిపారు. పేదలకు ఇండ్లు కట్టించి ఇచ్చేందుకు  కేంద్రం తీసుకువచ్చిన ప్రధానమంత్రి ఆవాస్‌‌ యోజన పథకాన్ని రాష్ట్ర ప్రజలకు అందకుండా టీఆర్​ఎస్​ సర్కారు అడ్డుకున్నదని, డబుల్​ బెడ్రూం ఇండ్లను  కట్టిస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. 

తెలంగాణ ప్రజలను లూటీ చేసేవాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్రమోడీ హెచ్చరించారు. అభివృద్ధికి, ప్రజాస్వామ్యానికి అవినీతి, కుటుంబపాలన పెద్ద శత్రువులని ఆయన అన్నారు.  ‘‘తెలంగాణ పేరు మీద పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చినవాళ్లు.. కుటుంబ అభివృద్ధి కోసం పనిచేస్తున్నరు తప్ప ప్రజలను పట్టించుకోవడం లేదు. విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారు. వాళ్లపై రాష్ట్ర ప్రజలు రగిలిపోతున్నరు. తెలంగాణలో చీకట్లు పోయి.. కమలం వికసించడం ఖాయం” అని ధీమా వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం ఏపీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకున్న ప్రధాని మోడీకి బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల సభలో, ఆ తర్వాత రామగుండంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.  రామగుండం ఎరువుల ఫ్యాక్టరీతోపాటు భద్రాచలం -  సత్తుపల్లి రైల్వే లైన్​ను జాతికి అంకితం చేశారు. మెదక్ - సిద్దిపేట - ఎల్కతుర్తి హైవే విస్తరణ, బోధన్ - బాసర - భైంసా హైవే, సిరొంచ - మహదేవపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులకు వర్చువల్​గా శంకుస్థాపన చేశారు. రాష్ట్రాన్ని అవినీతి, కుటుంబ పాలన నుంచి రక్షించడమే తన కర్తవ్యమని ప్రధాని తెలిపారు. 

నాకు దేవుడు ఓ వరమిచ్చాడు!

కొందరు నిరాశ, అత్యాశ, భయంతో పొద్దూమాపు నన్ను తిడుతూనే ఉంటారు. వాళ్ల డిక్షనరీ అంతా మోడీని తిట్టడమే  ఉంటుంది. ఇవి నాకు కొత్త కాదు. 20, 22 ఏండ్ల నుంచి వెరైటీ వెరైటీ తిట్లు తింటున్నాను. వాటి గురించి పట్టించుకోవద్దు. సాయంత్రం మంచిగా చాయ్​ తాగుతూ.. ఆ తిట్ల మీద జోకులు వేసుకొని నవ్వుకోండి. మరుసటిరోజు ఉదయం కమలం వికసిస్తదని ముందుకు వెళ్లండి. అధికారమనేది ప్రజలకు సేవ చేయడానికి ఓ మార్గం. తెలంగాణ ప్రజలు వీళ్ల(టీఆర్​ఎస్​)కు అధికారం ఇస్తే.. వీళ్ల ధ్యాసంతా మోడీని, బీజేపీని తిట్టడంపైనే ఉంది. రోజూ నేను రెండు మూడు కిలోల తిట్లు తింటాను కాబట్టే అలసట లేకుండా ప్రజలకు సేవ చేసుకోగలుగుతున్నాను. తిట్లన్నీ నా కడుపులో ప్రాసెస్​ అయి.. 
న్యూట్రిషన్​గా కన్వర్ట్​ అయ్యేలా దేవుడు వరమిచ్చాడు. 

- ప్రధాని మోడీ